Hyderabad Crime News: మరో దారుణం - బాలాపూర్ అదృశ్యమైన యువకుడు దారుణహత్య - తల, మొండం వేరుగా!
Hyderabad Crime News: హైదరాబాద్ బాలాపూర్ లో అదృశ్యమైన యువకుడి కేసు విషాదాంతంగా ముగిసింది. ఆ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చంపేసిన తర్వాత తల, మొండం వేరు చేశారు.
Hyderabad Crime News: హైదరాబాద్ శివారు బాలాపూర్ లో అదృశ్యమైన యువకుడి కేసు విషాదాంతంగా ముగిసింది. ఆ యువకుడు దారుణ హత్యకు గురవ్వడం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ కు చెందిన మామా జాఫర్ కుమారుడు ఫైజల్.. ఈ నెల 12వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో నుండి ఉస్మానియా హోటల్ కు వెళ్లాడు. ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదు. చాలా ఆలస్యం కావడంతో అతడికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారు కంగారు పడ్డారు. అక్కడిక్కడ వెతికారు. తెలిసిన చోట్ల ఉన్నాడేమో అని వెతికారు కుటుంబసభ్యులు. ఎంత వెతికినా జాఫర్ ఆచూకీ లభించలేదు.
కనిపించకుండా పోయిన 2 వారాల తర్వాత సమాచారం
ఇక లాభం లేదనుకుని ఫైజల్ తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన (శనివారం) రాత్రి ఒంటి గంట ప్రాంతంలో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. హత్య చేసిన వ్యక్తిని జబ్బార్ గా గుర్తించారు. మినర్ కాలనీకి చెంది హంతకుడు వృత్తి రీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు.
తలను, మొండెన్ని వేరు చేసి హత్య
ఫైజల్ ను జబ్బార్ అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. జబ్బార్ ఫైజల్ తలను, మొండెన్ని వేరు చేశాడు. అనంతరం శరీర భాగాలను షాహిన్ నగర్ లో పడేశాడు. హత్య జరిగిన రెండు వారాల తర్వాత తీవ్రమైన దుర్గంధం రావడంతో స్థానికులు దాని గురించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల నుండి సమాచారం రాగానే పోలీసులు షాహిన్ నగర్ లోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫైజల్ మొండెం కనిపించింది. దుస్తుల ఆధారంగా ఆ మొండెం ఫైజల్ గా గుర్తించారు పోలీసులు. అయితే ఫైజల్ తల మాత్రం ఇంకా దొరకలేదు. ఫైజల్ తలను ఎక్కడ పడేశాడు, ఎలాంటి పరిస్థితిలో అతడి తన ఉందన్న విషయం గురించి పోలీసులు గాలింపు చేపట్టారు.
హత్యకు కారణాలపై పోలీసుల విచారణ
ఈ హత్యోదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫైజల్ మొండెన్ని పోస్టుమార్టం చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జబ్బార్ ఫైజల్ ను ఎందుకు చంపాడు, ఎంతో పగ ఉంటే తప్పా ఇంత కిరాతకంగా చంపరు, వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మిత్రులు, పరిచయస్తులు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వారిని విచారిస్తున్నారు. ఫైజల్ ను ఫిబ్రవరి 12వ తేదీనే కిడ్నాప్ చేసి, అదే రోజు హత్య చేసి మొండెన్ని షాహిన్ నగర్ లో, తలను మరో చోట పడేసి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. ఇదే తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగాయి. రెండు మూడు రోజుల క్రితం అమ్మాయితో ప్రేమ విషయంలో హరి అనే యువకుడు నవీన్ అనే తన స్నేహితుడిని కిరాతకంగా హతమార్చాడు. శరీర భాగాలను వేరు చేసి వాటిని ఫోటో తీసి పంపించాడు.