Hyderabad News : దొంగలకే దొంగ ఈ పోలీసు, నిందితుడి అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు కొట్టేశాడు!
Hyderabad News : చోరీ కేసులో అరెస్టు చేసిన నిందితుడి అకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేశాడు ఓ ఇన్స్పెక్టర్. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు ఈ విషయాన్ని గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
Hyderabad News : చోరీ కేసుల్లో దొంగల్ని పట్టుకుంటారు పోలీసులు. ఎందుకుంటే ఇతరుల నగదు, నగలను అక్రమంగా దోచుకుంటారు కాబట్టి. అయితే ఓ పోలీసే దొంగలా చేతివాటం చూపించారు. దొంగ దగ్గర స్వాధీనం చేసుకున్న డెబిట్ కార్డుల్లో ఏకంగా రూ. 5 లక్షలు కొట్టేశాడు ఇన్స్పెక్టర్. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోనే చోటుచేసుకుంది. దొంగతనం కేసులో పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. అరెస్టై జైలులో ఉన్న నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడు. ఇన్స్పెక్టర్ వ్యవహారంపై అంతర్గత విచారణకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం బేగంబజార్ కు చెందిన టైర్ల కంపెనీ యజమానిని చోరీ కేసులో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డెబిట్ కార్డు నుంచి 5లక్షలు స్వాహా చేశాడో ఇన్స్పెక్టర్ పోలీస్ అధికారి.
అసలేం జరిగిందంటే?
ఫిబ్రవరి నెలలో అగర్వాల్ అనే వ్యక్తిని రాచకొండ పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అగర్వాల్ నుంచి డెబిట్ కార్డును సీజ్ చేశారు. అనంతరం నిందితుడి బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డెబిట్ కార్డు నుంచి నగదు విత్ డ్రా అవ్వడం గమనించాడు. అగర్వాల్ ఖాతా నుంచి రూ.5 లక్షలు విత్ డ్రా కావడంతో బ్యాంకు అధికారులను ఆరాతీశాడు. ఎక్కడ డబ్బులు డ్రా చేశారనే వివరాలను సేకరించాడు. సీజ్ చేసిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయంటూ ఆలోచనలో పడ్డాడు అగర్వాల్. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అగర్వాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ నిందితుడి ఏటీఎం కార్డ్ ద్వారా రూ.5 లక్షలు విత్ డ్రా చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అతనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
రక్షణ భటుడే భక్షిస్తే
చోరీ కేసులో అగర్వాల్ ను అదుపులో తీసుకున్న పోలీసులు, అతని డెబిట్ కార్డు సీజ్ చేయడమే కాకుండా, ఖాతా నుంచి ఏకంగా రూ. ఐదు లక్షలు విత్ డ్రా చేసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులే ఇలా చేస్తా ఎలా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచి ప్రజలకు రక్షణకు ఉండాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని ఖాతా ఖాళీ చేసి నిందితుడిలా మారడం విడ్డూరంగా ఉందని స్థానికులు చెప్పుకుంటున్నారు. రక్షక భటుడే భక్షకుడిలా మారి నిందితుల ఖాతా నుంచి డబ్బు కొట్టేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పోలీసుపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.