Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు - ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు 14 రోజులు రిమాండ్
Hyderabad Crime News: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నలకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
Hyderabad 14 days remand for accused in Phone Tapping Case: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ (Hyderabad) సెక్యూరిటీ విభాగం అడిషనల్ డీసీపీ తిరుపతన్న అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (SIB Former DSP Praneeth Rao) వెల్లడించిన వివరాల ఆధారంగా ఆ పోలీస్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం భుజంగరావు, తిరుపతన్నను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వీరిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 6 వరకు వీరికి రిమాండ్ విధించగా.. అనంతరం పోలీసులను వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఏప్రిల్ 6 వరకు నిందితులకు రిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు. కొంపల్లి మెజిస్ట్రేట్ నివాసం వద్ద నిందితుల తరఫు అడ్వకేట్ రాజేందర్ మాట్లాడుతూ.. భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు రెండు వారాల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. రిమాండ్ వ్యతిరేకించడంతో పాటు బెయిల్ ఇవ్వాలని మేజిస్ట్రేట్ ను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. దాంతో తాము తిరిగి మంగళవారం బెయిల్ ప్రొసీడింగ్స్ మొదలుపెడతామని అడ్వకేట్ రాజేందర్ వెల్లడించారు. రిమాండ్ లో భాగంగా నిందితులు ముగ్గుర్ని కొంపల్లి మేజిస్ట్రేట్ నివాసం నుంచి పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్నలపై ఐపీసీ సెక్షన్ 120a, 409, 427, 201, 34 of sec 3 public property damage కింద కేసులు నమోదు చేశారు.
గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, ఎస్‌ఐబీలో తిరుపతన్న అడిషనల్ ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేపట్టి వారం రోజుల కిందట మొదట ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం మొత్తం అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే జరిగినట్లు ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్ లాంటి కొన్ని ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల్ని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వెల్లడించారు.
లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేసిన అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో లింకులు ఉన్నాయని భావించి కొందరు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని లుక్ ఔట్ సర్క్యూలర్ సైతం జారీ చేశారు. శుక్రవారం (మార్చి 22న) రాత్రి భుజంగరావు, తిరుపతన్న నివాసాలతో పాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల నివాసంలో సోదాలు నిర్వహించారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు ఇంట్లో కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.