Tirupati Hizra Gang War : తిరుపతిలో రోడ్డెక్కిన హిజ్రాలు - పండుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - ఇంతకీ ఆ పండు ఎవరు ?
తిరుపతిలో హిజ్రాలు రోడ్డెక్కారు. పండుపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇంతకీ ఆ పండు ఎవరు ?
Tirupati Hizra Gang War : హజ్రాల మధ్య గ్యాంగ్ వార్స్ గురించి సినిమాల్లో చూస్తూంటాం.. కానీ నిజంగానే జరుగుతూ ఉంటాయి. అచ్చం సినిమాల్లో జరిగినట్లుగా రాయలసీమలో హిజ్రాల గురించి కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి హిజ్రాలు చెప్పుకున్న బాధలు వింటే ఔరా అనుకోక తప్పదు.
రాయలసీమలో హిజ్రాల్ని కొనుక్కున్నాడట పండు !
తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన హిజ్రాలు పండు అనే హిజ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాయలసీమలో హిజ్రాలందర్నీ తాను కొనుక్కున్నానని.. ఒక్కొక్కరూ భిక్షాటన చేసి అయినా సరే తనకు నెలకు రూ. ఐదు వేలు ఇవ్వాల్సిందేనని పండు వీరికి హుకుం జారీ చేశాడు. మనుషుల్ని పంపి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో తిరుపతిలోని హిజ్రాలకు మైండ్ మైండ్ బ్లాంక్ అయింది. మమ్మల్ని ఎవరో అమ్మడం ఏంది.. కొనుక్కున్నానని పండు అనే హిజ్రా వచ్చి డబ్బులివ్వాలని బెదిరించడం ఏమిటని అనుకున్నారు. వేధింపులు.. బెదిరింపులు రోజు రోజుకు ఎక్కువైపోతూండటంతో.. మీడియాకు చెప్పుకోవాలని నిర్ణయించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు పెద్ద ఎత్తున వచ్చి.. ఆందోళన చేసి. తమ బాధలు చెప్పుకున్నారు.
ఎవరీ పండు ?
పండు అనే వ్యక్తి నిజంగా హిజ్రానో కాదో స్పష్టత లేదు కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా హిజ్రాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఐదు వేల మంది హిజ్రాలు ఉంటారని.. వారిలో కొంత మంది నాయకులు ఉన్నారని చెబుతున్నారు. హిజ్రాలు తమ సమస్యల పరిష్కారం కోసం కొంత మందిని నాయకులుగా హిజ్రాల్లోని వ్యక్తుల్నే ఎంచుకుంటారు. అయితే పండు అనే వ్యక్తి కూడా ఓ గ్రూపుకు నాయకుడిగా ఉన్నాడని... అందరిపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వీరు అంటున్నారు. చివరికి కప్పం కట్టినట్లుగా డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తూండటంతో వీరంతా మీడియా ముందు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన !
హిజ్రాలు సాధారణంగా భిక్షాటన ద్వారా ఆదాయం పొందుతారు. వీరిని చూసి భయపడి సొమ్ములిచ్చేవారు కొందరయితే.. కొంత మంది డాన్సులకు.. ఇతర కార్యక్రమాలకు పిలిచి డబ్బులిస్తూ ఉంటారు. గతంలో వారిపై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చేవి. అయితే ఇటీవలి కాలంలో వారిపై పోలీసుల నిఘా పెరగడం.. సమాజంలో కాస్త గౌరవంగా ఉండాలంటే... డబ్బుల కోసం దౌర్జన్యం చేయడం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి నాయకుడిగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్న గంజాయి,డ్రగ్స్ మాఫియాతో చేతులు కలపి దౌర్జన్యాలకు దిగుతున్నారని వీరు ఆందోళన చెందుతున్నారు. పండు,అతని వర్గంపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మా పై దాడి చేస్తున్నాడని పోలీసులకు పిర్యాదు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవు ...పోలీసులు పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే మీడియా ముందుకు వచ్చామంటున్నారు.
అయితే పండుకు ఓ గ్యాంగ్ ఉందని.. ఆ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉన్న మరో గ్యాంగ్ ఉండటం వల్ల.. రెండు గ్యాంగ్ ల మధ్య వార్ వల్లనే ఈ సమస్య వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు.