Guntur: తల్లీ కూతుళ్ల గొంతు కోసిన యువకుడు, బ్లేడుతో దాడి - గుంటూరులో దారుణం
Guntur Crime: తల్లి, కుమార్తె గొంతులపై యువకుడు బ్లేడుతో కోయడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు కృష్ణ నగర్ పీఎఫ్ కార్యాలయం వద్ద ఉన్న అపార్ట్ మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కృష్ణ నగర్‌లో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు తల్లి, కుమార్తెపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. తల్లి, కుమార్తె గొంతులపై యువకుడు బ్లేడుతో కోయడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ నగర్ పీఎఫ్ కార్యాలయం వద్ద ఉన్న అపార్ట్ మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తక్షణం స్పందించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం అపార్ట్ మెంట్ రెండో అంతస్తులోకి వెళ్లిన నిందితుడు అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. వెంటనే పట్టుకున్న స్థానికులు అతణ్ని పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన యువకుడిని గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్‌కు తరలించారు.
గ్యాంగ్ వార్‌లో ఫుట్ బాల్ ప్లేయర్ హత్య
మరోవైపు, విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. బార్‌లో జరిగిన వివాదంతో గురునానక్ కాలనీ జక్కంపూడికి చెందిన ఆకాష్‌ను కొందరు దుండగులు హత్యచేశారు. ఇటీవల జరిగిన రౌడీ షీటర్ అంత్యక్రియల్లో తలెత్తిన వివాదమే ఫుట్‌బాల్ ప్లేయర్ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో రౌడీషీటర్ శంకర్ అలియాస్ టోనీ మరణించాడు. అతడి డెడ్ బాడీకి జీజీహెచ్‌లో పోస్టుమార్టం జరిపించారు టోనీ అనుచరులు. ఆ తరువాత దగ్గర్లోని ఓ బార్‌లో మద్యం సేవించేందుకు వెళ్లారు. శంకర్ గ్రూపులోనే రెండు వర్గాలు ఉన్నాయి. వీరంతా కలిసి మద్యం సేవిస్తుండగా ఓ వర్గానికి చెందిన యువకుడు, జక్కంపూడి కాలనీకి చెందిన ఆకాష్(23)కి, మరో వర్గానికి చెందిన వారితో గొడవ జరిగింది. ఈ గొడవలో అవతలి వర్గంలోని ఒకరిపై ఆకాష్ దాడి చేశాడు. ఇది సహించలేని ప్రత్యర్థి వర్గం ఆకాష్‌ను గురునానక్ కాలనీలోని ఓ స్నేహితుడికి రూమ్‌కు బలవంతంగా లాక్కెళ్లారు.
గదిలో ఉన్న ఆకాష్ మద్యం మత్తులో నిద్రపోగానే, ప్రత్యర్ధి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం, గంజాయి సేవించి గురునానక్ కాలనీకి వచ్చారు. ఒక్కసారిగా గుంపు అక్కడికి రావడంతో అకాష్ వెంట ఉన్న వారు గది నుంచి పారిపోయారు. మరో వ్యక్తిని బెదిరించి బయటకు పంపించేశారు. ఇదే ఛాన్స్ అని భావించిన దుండగులు ఒక్కసారిగా కత్తులతో ఆకాష్‌పై విచక్షణా రహితంగా దాడిచేయగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రత్యర్ధి వర్గం వెళ్లిపోయిందని తెలుసుకున్న వెంటనే అక్కడి చేరుకున్న స్నేహితులు ఆకాష్ పరిస్థితిని చూసి షాకయ్యారు. అతడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆకాష్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
శరీరంపై 16 కత్తిపోట్లు..
రౌడీ షీటర్ టోనీ అంత్యక్రియల్లో వివాదమే ఆకాష్ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన వ్యక్తులు ఆకాష్‌ను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గొంతు, మెడ, పొట్ట భాగంలో మొత్తం 16 వరకు కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి విచారణ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆకాష్ పలు టోర్నీలలో పాల్గొని కప్‌లు గెలుచుకున్నాడు. కానీ రౌడీ గ్యాంగ్‌తో కలిసి తిరగడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆకాష్‌కు తల్లిదండ్రులు, ఓ సోదరి ఉన్నారు.