Guntur Crime: నిండు గర్భిణీపై కత్తితో దాడి... గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని డ్రామా... అనుమానంతో భర్తే ఘాతుకం
తెనాలిలో నిండు గర్భిణీపై చాకుతో దాడి చేసి హత్య చేశాడు భర్త. ముందు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నాటకం ఆడిన భర్త.. పోలీసు విచారణలో నిజం చెప్పాడు.
తెనాలిలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసి ఆపై బ్లేడ్ తో దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. గర్భవతి అన్న కనికరం లేకుండా దాడి చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణ అసలు విషయం బయటపడింది. భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది.
గుర్తు తెలియని వ్యక్తులు చేశారని డ్రామా
గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటలో ఈ నెల 18న జరిగిన మహిళ హత్య కేసును త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. పాత చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే భీనపల్లి అంజలిపై ఆమె భర్తే దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నం చేసి హత్యకు పాల్పడినట్లుగా అందరినీ నమ్మించాడు. ఈ కేసులో నిందితుడైన మృతురాలి భర్త భీనపల్లి గోపాల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు త్రీ టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
అనుమానంతో భార్యపై దాడి
వరంగల్ పట్టణానికి చెందిన భీనపల్లి గోపాల్, అంజలి భార్యాభర్తలు కాగా సుమారు 10 సంవత్సరాల క్రితం తెనాలికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ వారి కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. రాత్రి వేళ వినాయకుడి గుడి వద్ద రోడ్డు పక్కన నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 18 రాత్రి భార్యపై అనుమానంతో మద్యం మత్తులో దాడి చేశాడు. ఫోల్డింగ్ రేకు, చాకుతో ఆమె ముఖం మీద తీవ్ర గాయాలు చేశాడు. అనంతరం తెలిసిన వారి సహాయంతో 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించాడు.
పోలీసుల విచారణలో అసలు విషయం
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చనిపోయే సమయానికి ఆమె ఏడు నెలల గర్భిణీ. భార్యపై అనుమానంతో భర్త గోపాల్ దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లుగా అందరినీ నమ్మించాడు. దీనిపై అనుమానించిన పోలీసులు అతడిని విచారిస్తే హత్యకు పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఫోల్డింగ్ రేకు, చాకును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
Also Read: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి