Guntur News : తుమ్మపూడిలో ఉద్రిక్తత, లోకేశ్ పర్యటనలో రాళ్ల దాడి
Guntur News : గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితురాలి పరామర్శకు లోకేశ్ వచ్చిన సమయంలో రాళ్ల దాడి జరిగింది. దీంతో ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు.
Guntur News : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి లోకేశ్ తుమ్మపూడి వెళ్లారు. అయితే లోకేశ్ పర్యటనకు వస్తున్నారని తెలిసి అక్కడ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. లోకేశ్ పరామర్శను వైసీపీ నేతలు అడ్డుకోడానికి వచ్చారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. రాళ్లదాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులను నారా లోకేశ్ పరామర్శించారు. లోకేశ్ తో పాటు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో లోకేశ్ మీదకి కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటారు.
తుమ్మపూడిలో ఉద్రిక్తత
తుమ్మపూడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మహిళను వివస్త్రను చేసి హత్యచేయడంపై కలకలం రేగింది. అయితే ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు తుమ్మపూడి వెళ్లారు. ఈ క్రమంలో ఘర్షణ తలెత్తింది. భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ మాట్లాడిన లోకేశ్.. మహిళను హత్య చేసి 24 గంటలు అయినా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదని నిలదీశారు. తాను పరామర్శకు వస్తున్నానని తెలిసి పోస్టు మార్టం మొదలుపెట్టరన్నారు. అలాగే పోస్టు మార్టం జరగకుండా అత్యాచారం జరగలేదని పోలీసులు ఎలా చెప్తారని లోకేశ్ నిలదీశారు.
బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
"నిందితులు ఎవరో చూపించమంటే చూపించరు. ఈ ఘటనపై సందేహాలు ఉన్నాయి. తెనాలికి చెందిన ఓ రౌడీషీటర్ హత్య చేసిన వాళ్లను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తే మాపై రాళ్ల దాడి చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తాం. బాధితురాలి పిల్లల్ని చదివిస్తానని హామీఇచ్చాను. పరామర్శ చేసేందుకు వస్తే మాపై రాళ్లదాడి చేశారు. కొంత మంది పోలీసు అధికారుల వల్ల పోలీస్ డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తుంది. ప్రజల పక్షాన నిలబడేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు ఊరిశిక్ష వేయించాలని మహిళ హోంమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. 21 రోజుల్లో బాధితులకు న్యాయం జరగక్కపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎస్పీ గారు పోస్టు మార్టం చేయకుండానే అత్యాచారం జరగలేదని ఎలా చెప్పారు" అని లోకేశ్ ప్రశ్నించారు.
"చట్టాలంటే గౌరవం, భయంలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. జగన్ వెయ్యి రోజుల పాలనలో 800 మందికి పైగా మహిళలపై దాడులు జరిగాయి. గన్ కంటే ముందు వస్తానన్న జగన్ ఎక్కడా?. బుల్లెట్ లేని గన్ జగన్ అని అర్ధమైంది. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. నిన్న హత్యాచారం జరిగే సమయంలో పోలీసులంతా మహిళా కమిషన్ కార్యాలయం వద్ద వాసిరెడ్డి పద్మ గారి సేవలో ఉన్నారు. నాపై రాళ్లు విసిరితే పారిపోతాననుకుంటారా? పది మంది వైసీపీ మూకల్ని పోలీసులు కంట్రోల్ చేయలేరా? కొంతమంది పోలీసుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. పోస్ట్ మార్టం జరగక ముందే సామూహిక అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్తారు?" అని లోకేశ్ ప్రశ్నించారు.