Guntur Crime : పత్తి వ్యాపారి దారి దోపిడీ నాటకం, ప్రియురాలి కొడుక్కి డబ్బులిచ్చి డ్రామా!
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలి కొడుక్కి డబ్బులు ఇచ్చి దారి దోపిడీ నాటకం అడినట్లు గుర్తించారు.
Guntur Crime : పదేళ్లుగా పత్తి వ్యాపారం చేస్తున్నాడు అతడు. నమ్మకంగా ఉంటూ రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మిల్లు యజమానులకు విక్రయిస్తుంటాడు. అయితే ఈ నెల పదిహేడో తేదీన అతనిపై దుండగలు దాడి చేసి రెండు లక్షల రూపాయలను అపహరించుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీస్తే అతని గురించి అందరూ మంచివాడనే చెప్పారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు... ఆ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి రెండు లక్షలు ఇవ్వడం కోసం దారి దోపిడీ స్కెచ్ వేశాడని నిర్థారించారు.
అసలేం జరిగింది?
గుంటూరు రూరల్ మండలం కంతేరుకు చెందిన గంధం శ్రీను పదేళ్లుగా పత్తి వ్యాపారం చేస్తున్నాడు. రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మిల్లు యజమానులకు విక్రయిస్తుంటాడు. అలా వచ్చిన లాభంతో జీవనం సాగిస్తున్నాడు. తాను ఆటో కొనుగోలు చేసి రైతుల వద్ద కొన్న పత్తిని వ్యాపారులకు, మిల్లు యజమానులకు చేరవేస్తుంటాడు. అయితే ఈ నెల 17వ తేదీన జాతీయ రహదారిపై పత్తి దించి వస్తున్న శ్రీనును రెండు బైక్ లపై వెంబడించిన దుండగులు దాడి చేసి రెండు లక్షల రూపాయలను అపహరించుకుపోయారు. ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి వెళ్లిన శ్రీను ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్ని ఆధారాలు సేకరించారు. ఎక్కడా దోపిడీ జరిగినట్లు ఆనవాళ్లు లభించలేదు. మరోవైపు శ్రీను గురించి అటు రైతులు గాని, ఇటు వ్యాపారులు గాని వ్యతిరేకంగా చెప్పలేదు. దీంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్ గా మారింది.
బయటపడ్డ వివాహేతర సంబంధం
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు..విచారణలో శ్రీను వివాహేతర సంబంధం గురించి తెలిసింది. ఆ కోణంలో తీగ లాగితే డొంక కదిలింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి పత్తి అమ్మగా వచ్చిన రెండు లక్షల రూపాయలను ఇచ్చి పంపించాడు శ్రీను. ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టటానికి దోపిడీ జరిగినట్లు నాటకం ఆడాడు. దీంతో శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. పత్తి అమ్మగా వచ్చిన డబ్బులను ముందుగా తన ప్రియురాలి కొడుక్కి ఇచ్చి పంపించాడు. అనంతరం హైవే పై వస్తూ దోపిడీ జరిగినట్లు తనకు తానే గాయం చేసుకొని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్ని విషయాలు బయటకొచ్చాయి. శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు మధ్యవర్తులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సురేష్ చెప్పారు. లేకుంటే రైతులు నష్టపోవాల్సి ఉంటుందన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో దారి దోపిడీ
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో దారి దోపిడీ ఘటన జరిగింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్ పోస్టు సమీపంలో శనివారం అర్ధరాత్రి దుండగులు బంగారం, నగదుతో వెళ్తోన్న వ్యాపారుల కారుపై దాడి చేశారు. వ్యాపారుల కారును మరో కారులో ఫాలో అయిన ఆరుగురు దుండగులు వ్యాపారుల కారు అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్ సహా ఐదుగురిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి నగదు, బంగారం, కారుతో సహా దొంగలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గిద్దలూరు కె.ఎస్.పల్లె రైల్వే బ్రిడ్జి వద్ద కారును దుండగులు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. కారు లాకర్ లోని రూ.14 లక్షలు నగదు, 950 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు.