Crime News: ఎనిమిదేళ్ల పసివాళ్లతో వ్యభిచారం- రాకెట్‌లో డీఎస్పీ, ప్రభుత్వ ఉద్యోగులు
Telugu Crime News: తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి, ఎనిమిదేళ్లలోపు వయసున్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి వ్యభిచార కూపంలోని నెట్టేస్తోన్న ఉదంతం అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసింది.
Arunachal Pradesh News : డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనుషులు కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటారనేందుకు నిదర్శనమనీ ఉదంతం. ఎనిమిది నుంచి పదేళ్ల లోపు వయసున్న చిన్నారులతో పాశవికంగా వ్యభిచారం చేయిస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసు, వైద్య శాఖ ఉన్నతాదికారులు, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గత పది రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని మూడు వేరు వేరు ప్రాంతాల నుంచి అయిదుగురు మైనర్‌లను పోలీసులు వ్యభిచార కూపంలో నుంచి కాపాడారు. వీరిలో పదేళ్ల పాప, పన్నెండేళ్ల పాపలతో పాటు 15 ఏళ్ల బాలికలు ముగ్గురున్నారు. ఈ అయిదుగురు బాలికలను.. అరుణాచల్ ప్రదేశ్‌కు పక్క రాష్ట్రమైన అసోంలోని గ్రామీణ ప్రాంతాల నుంచే తీసుకొచ్చారు. నిందితులకు అసోంలోని పేద కుటుంబాలే లక్ష్యం. ‘‘మీ పిల్లల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత మాది. ఒట్టు... నమ్మి మాతో పంపండి’’ అని వారికి నమ్మబలుకుతారని పోలీసులు తెలిపారు. ఈ రాకెట్‌లో మొత్తం 21 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
డీఎస్పీ సాబ్‌కి కూడా చిన్న పిల్లలే కావాలి.. సిగ్గు చేటు. .
నిందితుల్లో పది మందిని పిల్లల్ని అక్రమంగా తరలించినందుకు, వారిని వ్యభిచారంలోకి దింపి కస్టమర్ల వద్దకు పంపినందుకు అరెస్టు చేశారు. వీరిపై బాలికలను వ్యభిచారం కోెసం కొనడం (ఐపీసీ సెక్షను 373 కింద), మానవ అక్రమ రవాణా చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. మిగిలిన 11 మందిని కస్టమర్లుగా పోలీసులు గుర్తించారు. బాధిత బాలికలపై వీరు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అరుణాచల్ పోలీసు ఫోర్సుకు చెందిన డీఎస్పీ బులంద్ మరిక్, హెల్త్ డైరెక్టరేట్‌లో డీడీ డా. సెన్లార్ రోన్యా, టోయ్ బోగ్రా అనే ఓ కానిస్టేబుల్, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ స్థాయి ఉద్యోగులు ఇద్దరు ఉన్నట్లు ఇటానగర్ ఎస్పీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపారు.
జరిగింది ఇదీ..
‘‘ఇద్దరు బాలికల్ని పక్క రాష్ట్రం నుంచి తెచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని మే నాలుగున మాకు సమాాచారం వచ్చింది. రెండు వేరు వేరు ప్రాంతాల్లో రైడ్ చేసి నలుగురు బాలికల్ని కాపాడాం. అసోం ధెమాజీ జిల్లాకి చెందిన పుష్పాంజలి మిలి, పూర్నిమా మిలి అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు ప్రస్తుతం ఇటానగర్‌లో ఒకరు. గౌహతిలో ఒకరు ఉంటున్నారు. పుష్పాంజలి ఇటానగర్‌లో బ్యూటీ పార్లన్ నడిపిస్తోంది. అయితే వీళ్లిద్దరూ.. తమ సొంత జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన బాలికలనే టార్గెట్ చేశారు. వాళ్లిళ్లకు వెళ్లి తమ వెంట తీసుకెళ్లి పని నేర్పిస్తామనిి, వాళ్లకు ఏ హానీ జరగనివ్వమని నమ్మబలికారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ చూపించారు. ఒక పాపని 2020లో ఇంకో పాపని 2022లో.. ఇలా వేరు వేరు సంవత్సరాల్లో వాళ్లని ఇటానగర్‌కు తీసుకొచ్చారు. ఒకటి రెండు నెలలు పార్లర్‌లో పని చేయించుకునే వారు. కానీ ఆ తరువాత వాళ్లని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేసేవారు. 2020లో ఇటానగర్‌కు తెచ్చిన పాప వయసు అప్పట్లో కేవలం ఎనిమిదేళ్లే. ఆ పాప వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోయింది కూడా. అయినా ఆ చిన్నారిని తిరిగి పట్టుకుని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.’’ అని ఎస్పీ వివరించారు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చిన్నారులకు రేట్ పెట్టి..
నిందితులు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. దాంట్లో విటులకు ఓ రేటు కార్డులను అందుబాటులో ఉంచారని ఎస్పీ తెలిపారు. ‘‘ బాధిత బాలికల పొటోలు, వాటి పక్కన వారికి నిర్ణయించిన రేటు.. ఇలా ఒక పట్టిక రూపొందించి పెట్టేవారు. ఈ గ్రూపుల్లో పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఉండేవారు. కానీ ఒక్కసారి అరెస్టులు మొదలవ్వడంతో ఒక్కొక్కరుగా ఆ గ్రూపుల్ని వదిలేయడం మొదలెట్టారు. అయితే ప్రస్తుతం కష్టమర్లంటూ మేము అరెస్టు చేసిన వారి విషయంలో మాత్రం పూర్తి సాక్ష్యాధారాలు తీసుకున్నాకే అరెస్టు చేశాం. నిర్వాహకులతో సంభాషణలు, వారికి వీరికి మధ్య పిల్లల రేటు కార్డుకు అనుగుణంగా నడిచిన ఆర్థిక లావాదేవీలు, హోటల్ రూమ్ బుకింగులు ఆధారంగా వారిని అరెస్టు చేశాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు.
పిల్లలను పెంచి కొంత పెద్దవ్వగానే నరకంలోకి..
తొలుత 18 మందిని అరెస్టు చేసి నలుగురు బాలికల్ని రక్షించగా.. చింపు ప్రాంతంలో హోటల్ నడుపుతోన్న మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దులాల్ బసుమతరి, దీపాలి బసుమతరి దంపతులు చింపులో ఉంటారు. వీరు చాలా కాలంగా ఓ పాపను పెంచుతున్నారు. ఆ పాప కొంచెం పెద్దదవ్వగానే ఆమెను వ్యభిచారంలోకి దింపినట్లు వారిపై అభియోగాలున్నాయి. 15 ఏళ్ల వయసున్న ఆ బాలికను కూడా పోలీసులు రక్షించారు. ప్రస్తుతం బాలికలంతా చైల్డ్ వెల్ఫేర్ హోమ్ లో సురక్షితంగా ఉన్నారని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని రోహిత్ రాజ్‌బీర్ సింగ్ చెప్పారు.