Crime News : ఘట్‌కేసర్ కాలేజీలో ఫోటోల న్యూడ్ మార్ఫింగ్ కేసులో సంచలనం - నలుగురు అరెస్ట్ ! వాళ్లెవరంటే ?
ఘట్‌కేసర్ కాలేజీలో విద్యార్థినుల ఫోటోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేస్తున్న నలుగుర్ని పోలీసులు పట్టుకున్నారు. వాళ్లు కాలేజీకి సంబంధించిన వారేనని తెలుస్తోంది.
Crime News : హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ ఇంజినీరింగ్ కాలేజీలోని విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యూలేట్ చేస్తున్న నలుగురు సైబర్ చీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరెవరన్నది ఇంకా పోలీసులు బయట పెట్టలేదు. వీరు ఆ కాలేజీలో చదివే విద్యార్థులా లేకపోతే బయట వ్యక్తులా అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం గత మూడు రోజుల నుంచి సంచనలం సృష్టిస్తోంది. ఘట్కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిల ఫొటోలను కొందరు ఆగంతకులు మార్ఫింగ్ చేస్తున్నారు. విద్యార్థినిల ఫొటోలను న్యూడ్‌గా తయారు చేసి వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టింగ్ చేస్తున్నారు.
కాలేజీలో ఉన్న వారి పనే ! వారు విద్యార్థులా ? ఉద్యోగులా ?
అంతేకాకుండా ఆ మార్ఫింగ్ ఫొటోలను ఆగంతకులు విద్యార్థులకు పంపి వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యార్థినుల ఫోటోలను... కళాశాలకు చెందిన విద్యార్థినుల వాట్సాప్ డీపీల నుంచి ఫొటోలు సేకరించి.. తిరిగి వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపిస్తూ, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నాడు. నాలుగైదు నెలలుగా ఈ తంతు జరుగుతోంది. ఈ విషయమై గతడాది నవంబరు 4న హాస్టల్ వార్డెన్‌కు, 9న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్తి సంఘాలు ళాశాల గేటు ఎదుట ధర్నాకు దిగారు. గతేడాది నవంబరు నుంచి తమ ఫొటోలను మార్పింగ్ చేస్తున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నవంబర్‌లోనే ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చూపించిన కాలేజీ యాజమాన్యం
ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏ ఏ నెంబర్ల నుంచి ఇలా మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ అయ్యాయో ఆరా తీసి వెంటనే .. సైబర్ నిపుణుల సాయంతో నిందితుల్ని పట్టుకున్నారు. మొత్తం నలుగురు ముఠాగా ఏర్పడి ఈ పని చేసినట్లుగా గుర్తించారు బాధితులైన విద్యార్థినులు చాలా మంది పరువు పోతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నారు. ఆ విద్యార్థినుల కుటుంబసభ్యులు కూడా.. పోలీసులు ఆ మార్ఫింగ్ ఫోటోలు బయటకు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో పోలీసుల రహస్య విచారణ
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురు నిందితులు కాలేజీకి సంబంధించిన వారేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారు విద్యార్థులా.. సీనియర్ విద్యార్థులా... ా విద్యార్తినులకు పరిచయస్తులా.. లేకపోతే ఉద్యోగులా అన్నది స్పష్టత లేదు. కానీ మొత్తానికి కాలేజీకి సంబంధించిన వారేనని చెబుతున్నారు. ఈ అంశంలో స్టూడెంట్స్ భవిష్యత్ ముడిపడి ఉంది కాబట్టి పోలీసులు కూడా గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరెవరు అన్నది ఇంకా స్పష్టత రాలేదు. విద్యార్థులే అయితే ఈ అంశం మరింత సంచలనం సృష్టించనుంది.