Ganja Seize: 'పుష్ప' సినిమానే మించిపోయారు - ఏకంగా అంబులెన్సులోనే గంజాయి తరలింపు
Kothagudem News: అంబులెన్సులో గంజాయి తరలిస్తుండగా స్థానిక యువకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.
Ganja Seized In Kothagudem: గంజాయి నివారణకు పోలీసులు ఎంత పటిష్ట చర్యలు చేపడుతున్నా కొందరు కొత్త కొత్త ఎత్తుగడలతో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా, కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో ఏకంగా పుష్ప సినిమా సీన్‌నే మించేలా ఏకంగా అంబులెన్సులోనే గంజాయి రవాణా చేస్తున్న కొందరిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏవోబీ నుంచి తమిళనాడుకు (Tamilnadu) అంబులెన్సులో తరలిస్తున్న సమయంలో కొత్తగూడెం (Kothagudem) వద్ద అంబులెన్స్ టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో డ్రైవర్ స్థానిక యువతను సాయం అడగ్గా.. వారు టైర్ మార్చేందుకు సాయం చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు అనుమానంతో అంబులెన్స్ డోర్ తెరవగా.. వెనుక భాగంలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అంబులెన్సులో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్సును సీజ్ చేసి డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గంజాయి విలువ రూ.కోట్లలో ఉంటుందని తెలిపారు. కాగా, ఇటీవల కొత్తగూడెంలో రూ.87 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు.
కాగా, ఏవోబీ నుంచి గంజాయి అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. అడవి మార్గం గుండా వస్తే ఎవరికీ అనుమానం రాదని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రధాన పట్టణాలకు చేరవేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్టంగా నియంత్రిస్తున్నా కొందరు కొత్త దారుల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. విశాఖ, తూ.గో జిల్లాల్లో అడవి మార్గాల్లో గంజాయి రవాణా సాగుతోందని నిఘా పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట వరకూ అడవి మార్గం ఉంటుంది. కొత్తగూడెం దాటిన తర్వాత ఇల్లందు నుంచి గంగారం మీదుగా పాకాల అడవి మార్గంలో స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తూ నగరానికి చేరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మరింతగా నిఘా పెంచుతున్నారు.