Ganja Cultivation: నగరం నడిబొడ్డున గంజాయి సాగు - నేవీ పరిధిలో ఉన్న ప్రాంతంలోనే పండించేస్తున్నారు
Visakha News: విశాఖలో గంజాయి సాగు కలకలం రేపింది. నగరం నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Ganja Cultivation In Visakha KGH Hill: ఏపీలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వరకూ ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి సాగు నేడు నగరం నడిబొడ్డు వరకూ చేరుకుంది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా కొందరి తీరు మారడం లేదు. తాజాగా, విశాఖ (Visakha) నగరం నడిబొడ్డునే గంజాయి సాగు కలకలం రేపుతోంది. కేజీహెచ్ కొండపై లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కొండపై కొందరు స్మగర్లు గంజాయి పండిస్తున్నారు. ఏడాదిన్నరగా వారు గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏకంగా నేవీ పరిధి ఉన్న ప్రాంతంలోనే గంజాయి సాగు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే కేజీహెచ్ లేడీస్ హాస్టల్‌ను నగర సీపీ శంఖబ్రతబాగ్చీ సందర్శించారు. ఆయనకు ఈ ప్రాంతంపై అనుమానం కలగడంతో పోలీసులను ఆదేశించారు. వారు దృష్టి సారించగా గంజాయి సాగు విషయం బయటపడింది. నగరం నడిబొడ్డునే గంజాయి సాగుతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
దీనికి సంబంధించి పలువురు యువకులను విశాఖ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో గంజాయి సాగు చేస్తున్నారని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒక ముఠాగా ఏర్పడి గంజాయి సాగు చేస్తున్నారా.?, లేదా ఆకతాయితనంగా చేస్తున్నారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.