Jagadgirigutta Police : బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠా అరెస్ట్
Hyderabad : నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో బాలానగర్ ఏసిపి హనుమంత్ రావు వివరాలు వెల్లడించారు.
Jagadgirigutta police : హైదరాబాద్ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసిపి హనుమంత్ రావు వివరాలు వెల్లడించారు. ఐదుగురు మహిళలు, ఒక పురుషుడితో కూడిన ముఠా పలు దుకాణాల్లో చోరీ చేశారు. ఈ ముఠా గుంపులుగా దుకాణాలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ దుకాణ యజమానుల దృష్టిని మరల్చి విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు.
ఖమ్మం నుంచి వచ్చి ముఠా కట్టి
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసిపి హనుమంత్ రావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మా(60), బంధువులైన బొజ్జగాని దీనమ్మ(62), బొజ్జగాని నాగేంద్రమ్మ(70), వెంకట రమణమ్మ(50), బాలసాని అశోక్(27), బాలసాని వేంకటపతిలతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుంది. నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు కొనుగొలుదారులుగా ప్రవేశించి, దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చేవారు. వారిలో ఒకరు అసలు బంగారు ఆభరణాలతో, వారు వెంట తెచ్చుకున్న నకిలీ బంగారు ఆభరాలతో మార్చి అక్కడి నుండి ఉడాయించేవారు. ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దుకాణాలు, జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం, చైతన్యపురి పరిధిలోని ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు.
నలుగురు అరెస్ట్
బంగారు దుకాణాల యాజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ముఠా నాయకురాలు బొజ్జగని జ్ఞానమ్మ, కారు డ్రైవర్ బాలసాని వేంకటపతి పరారీలో ఉన్నారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మ పై 11, నాగేంద్రమ్మ పై 12, వెంకట రమణమ్మ పై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని, నిందితులను కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఏసిపి తెలిపారు.
గత నెలలో కూడా ఇదే తరహా ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన ఐదుగురు మహిళలతో కూడిన ముఠాను సికిందరాబాద్‌లోని సితారా హోటల్‌లో పట్టుకున్నారు పోలీసులు. ఈ ముఠా గుంపులుగా దుకాణాలలోకి వెళ్లి నగలను కొంటున్నట్లు నటిస్తూ దుకాణ యజమానుల దృష్టి మరల్చి విలువైన వస్తువులను దొంగిలించేవారు. సుల్తాన్‌బజార్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ ఎన్నారై మహిళ నుంచి బ్యాగ్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠా దొంగిలించిన డబ్బుతో విలువైన దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.14వేల విలువ చేసే నకిలీ నగలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 100 గంటలపాటు సీసీటీవీఫుటేజీలను పరిశీలించిన తర్వాత ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో దొంగల బీభత్సం బాాగా పెరిగిపోయింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దొంగతనాలకు పుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు.