Kumbh Mela Fire Accident: కుంభమేళాలో మరో భారీ అగ్నిప్రమాదం, తగలబడుతున్న టెంట్లు - మంటలార్పుతున్న సిబ్బంది
MahaKumbh Mela 2025 |

Fire Accident at MahaKumbh Mela: కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి టెంట్లు తగలబడిపోతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా, కుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మృతిచెందారు. ఆ మరుసటిరోజే కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్-22లో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి భక్తులు సేదతీరేందుకు వేసిన టెంట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు ఎలా చెలరేగాయి, అగ్నిప్రమాదం జరగడానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
కుంభమేళాలో రెండో అగ్నిప్రమాదం..
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో వేడుకగా జరుగుతోన్న మహా కుంభమేళాలో జనవరి 25న రెండోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళాకు సమీపంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
కుంభమేళాలో తొలి అగ్నిప్రమాదం..
జనవరి 19న మహా కుంభమేళాలో తొలి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 180 వరకు టెంట్లు మంటలకు కాలిపోయాయి. ఆరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రాంతంలో మహా కుంభమేళా ప్రాంతంలో శాస్త్రి బ్రిడ్జి సమీపంలోని సెక్టార్ 19లో గీతా ప్రెస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగదిలో టీ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. అనంతరం సిలిండర్లు పేలడంతో టెంట్లు కాలిపోయి ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నా.. ప్రయాగ్ రాజ్‌కు భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

