Murder In Chittoor: అందరూ చూస్తుండగానే హత్య చేశాడు- గ్రామ వాలంటీర్‌కు చెప్పి పరారయ్యాడు
స్నేహితుడి తండ్రినే పట్ట పగలు కిరాతకంగా హత్య చేసి యువకుడు.. గ్రామ వాలంటీర్‌కి చెప్పి మరీ పరార్.. అసలు ఏం జరిగిందంటే..?
చిన్న చిన్న కారణాలకే కక్ష పెంచుకుని హత్య చేస్తున్నారు కొందరు. ఏ మాత్రం మానవత్వం లేకుండా నిండు ప్రాణాన్ని గుడ్డు పగలగొట్టినట్టు తీసేస్తున్నారు. పచ్చటి కుటుంబాలను నడివీధిలో నిలబెడుతున్నారు. తన కుమారులతో తిరగొద్దు అన్నందుకే స్నేహితుడి తండ్రిని చంపేశాడో యువకుడు. పట్ట పగలే దారుణంగా కత్తితో నరికి చంపాడు చిత్తూరు జిల్లాలో.
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకంపల్లిలో ఓ యువకుడు పట్ట పగలే ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపాడు.. పెద్దకంపల్లిలో ఉండే శ్రీనివాసుల రావును తన కుమారులు స్నేహితుడే హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస రావుకు బిడ్డలు ఇద్దరు కొద్ది రోజులుగా తండ్రి మాటలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడి ఇంటిపట్టున ఉండటం లేదు. పక్క గ్రామాల్లో అప్పులు చేసి జల్సాలు చేస్తున్నారని చాలా మంది ఫిర్యాదు చేశారు.
చెడు వ్యసనాలు వద్దని రెండు ఏళ్ళుగా కుమారులు ఇద్దరికీ తండ్రి శ్రీనివాసలు చెబుతూ వస్తున్నాడు. దీనిపై తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అనే ఆశతో తన బిడ్డలు చేస్తున్న అప్పులను శ్రీనివాసురావు తీరుస్తూ వస్తున్నాడు. మెల్లిగా వాళ్లను మార్చడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు.
అసలు తన బిడ్డలు ఎవరో తిరుగుతున్నారు. ఇలా ఎందుకు మారారనే విషయంలో ఆరా తీస్తే... లింక్ దొరికింది. గిరిబాబు నాయుడు అనే యువకుడితో స్నేహ కారణంగానే ఇదంతా జరుగుతుందని గ్రహించాడు శ్రీనివాసరావు. రోజూ ముగ్గురు ఫుల్‌గా తాగి పేకాడుతూ జల్సాలు చేస్తున్నట్టు పసిగట్టాడు శ్రీనివాసరావు. ఎందుకిలా చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి గాయ పరిచేవారు. దీంతో గ్రామంలో ఎవరూ వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.
రోజు రోజుకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తన కుమారులను తలుచుకుని శ్రీనివాసురావు కుమిలి పోయేవాడు. అనేక మార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ముగ్గరిని హెచ్చరించినా తీరు మార్చుకో లేదు. గొడవలు తగ్గలేదు. తన కుమారులను దారిలోకి తెచ్చేందుకు నేరుగా గిరిబాబుతో మాట్లాడే మార్పు వస్తుందని అనుకున్నాడు శ్రీనివాసరావు. గిరిబాబు నాయుడిని పిలిచి తన కుమారులతో కలిసి తిరగొద్దని...వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని హెచ్చరించాడు.
శ్రీనివాసరావు చెప్పిన మాటలను లైట్ తీసుకున్నాడు గిరిబాబు. రోజులాగే మద్యం తాగుతూ పేకాడుతూ కాలం గడిపేసేవాళ్లు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు ఈ మధ్యాహ్నం తన కుమారులతో చేరద్దని గిరిబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. గిరిబాబు, శ్రీనివాసురావు ఇద్దరూ ఒకరినొకరు దూషించుకుని, వాగ్వాదానికి దిగ్గారు.
గొడవ పెద్దదైంది. ఆగ్రహంతో ఊగిపోయిన గిరిబాబు తన నివాసంలో ఉన్న కత్తిని తీసుకొచ్చి శ్రీనివాసరావుపై అటాక్ చేశాడు. ఒక్కసారిగా దాడి చేసి గ్రామస్తులు అందరూ చూస్తుండంగానే అతికిరాతకంగా నరికి చంపాడు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసురావు ఘటన స్ధలంలోనే ప్రాణాలను విడిచాడు.
భయాందోళనకు గురైన గ్రామస్తులు చౌడేపల్లె పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటన స్ధలానికి పోలీసులు చేరుకునేలోపే గిరిబాబు ఎస్కేప్ అయ్యాడు. గ్రామ వాలంటీర్‌ను పిలిచిన తాను పారిపోతున్నట్లు చెప్పి పరార్ అయ్యాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడు గిరిబాబు నాయుడు కోసం గాలిస్తున్నారు. నిందుతుడు గిరిబాబు నాయుడుపై తిరుపతిలో మూడు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.