Dammaiguda Girl Missing Case: దమ్మాయిగూడలో నిన్న బాలిక అదృశ్యం - నేడు చెరువులో మృతదేహం
Dammaiguda Girl Missing Case: రోజూలాగే బడికి వెళ్లిన పాప గురువారం రోజు అదృశ్యం అయింది. నాలుగో తరగతి చదివే ఆ బాలిక ఈరోజు ఉదయం చెరువులో శవంగా తేలింది.
Dammaiguda Girl Missing Case: హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. గురువారం అదృశ్యమైన పదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం చెరువులో శవంగా తేలింది. నిన్ననే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అది హత్యో లేక ఆత్మహత్య తేల్చలేమని పోలీసులు అంటున్నారు.
అసలేం జరిగిందంటే..
దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రి నరేష్ తో పాటు బడికి వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచి పెట్టి పుస్తకాలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు పాఠాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే బాలిక వెళ్లిపోయిన విషయం తనకు తెలియగానే.. ఇందు తండ్రికి ఫోన్ చేసి ప్రిన్సిపల్ విషయం చెప్పారు. హుటాహుటిన బడికి వచ్చిన బాలిక తండ్రి చుట్టుపక్కల వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకు కేసు నమోదు చేసుకొని ఇందూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియ రాలేదు. డాగ్ స్వ్కాడ్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఈరోజు ఉదయం మృతదేహం లభ్యం కావడంతో శవాన్ని బయటకు తీశారు. బాలికను ఎవరైనా హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఏరియాలో గంజాయి ముఠాలు, తాగుబోతులు ఎక్కువగా సంచరిస్తారని వారే ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ఆధారాలు లభించేవని చెబుతున్నారు. పాప శరీరంపై గాయాలు ఉన్నాయని, నడుము భాగంలో ఎక్కువగా దెబ్బలు ఉన్నట్లు చెబుతున్నారు. బాలిక ఒక్కతే బయటకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి పోలీసులు బాలిక ఏమైనా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఏం తెలియదు. మరి చూడాలి ఏం జరిగిందో.
మూడు నెలల క్రితం నాగోల్ లో ఇలాగే..
హైదరాబాద్ నాగోల్ అయ్యప్ప కాలనీలో మూడేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల వివరాల మేరకు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ అయ్యప్పనగర్ కాలనీకి చెందిన షేక్షావలి, సాకీరా భార్యభర్తలు. పదేళ్లుగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు షాహిద్ ఉన్నాడు. నిన్న షేక్షావలి బయటకు వెళ్లగా, సాకీరా ఇంట్లోనే ఉంది. అదే సమయంలో సాహిత్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే, చాలా సమయమైనా షాహిద్ ఇంట్లోకి రాకపోవడంతో.. సాకీరా చుట్టుపక్కల గమనించగా ఎక్కడా కనిపించలేదు.
అర్ధరాత్రి శవంగా చెరువులో కనిపించిన బాలుడు..
బంధువులు, తెలిసిన వాళ్ల ఇంట్లో ఏమైనా ఉన్నాడా అని సాకీరా ఆరా తీసింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో.. భర్త వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అదృశ్యమైన బాలుడి కోసం స్థానికులు కూడా వెతికారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు కాలనీకి సమీపంలో ఉన్న చెరువులో అర్ధరాత్రి 12 గంటలకు ఓ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు విషయాన్ని పోలీసులకు తెలపడంతో.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఈతగాళ్ల సాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. అయితే చెరువులో లభ్యం అయిన మృతదేహం అదృశ్యమైన షాహిద్ గా గుర్తించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆడుకునేందుకు బయటకు వెళ్లి మృతదేహంగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.