Cyber Crime: సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు - సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెదిరించి లోన్ తీసుకున్నారు, ఎక్కడంటే?
Crime News: తిరుపతిలోని విద్యానగర్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఫోన్‌లో బెదిరించి బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని అతని పేరిట లోన్ తీసుకున్నారు.
Software Employee Frauded By Cyber Criminals: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ కొత్త పంథాతో మోసాలకు తెరతీస్తున్నారు. ఫేక్ కాల్స్, బెదిరింపులకు పాల్పడుతూ భారీగా డబ్బులు దోచేస్తున్నారు. తాజాగా, ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి సైతం ఇలాగే కుచ్చుటోపీ పెట్టారు. బెదిరించి అతని పేరిట రూ.లక్షల్లో లోన్ తీసుకుని ఆ డబ్బు కాజేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని (Tirupati) విద్యానగర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రూపకుమార్‌కు ఈ నెల 5న కొందరు దుండగులు సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో ఫోన్ చేశారు. ఇరాన్‌కు వస్తువులు అక్రమంగా సరఫరా చేశారంటూ ఆయన్ను బెదిరించారు. విచారణకు ముంబై రావాలని అన్నారు. లేకుంటే స్కైప్‌లో మాట్లాడాలని తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన రూప్ కుమార్.. వారు ఏది చెబితే అది చేసుకుంటూ పోయాడు.
బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి
ఈ క్రమంలోనే రూప్ కుమార్ నుంచి బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ ఇలా అన్ని వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరించారు. వీటితో బాధితునికి తెలియకుండానే లోన్ తీసుకుని ఆ మొత్తాన్ని కాజేశారు. అయితే, రూ.13.8 లక్షల రుణం తీసుకున్నట్లు బ్యాంక్ నుంచి రూప్‌కుమార్‌కు ఫోన్ రావడంతో షాక్‌కు గురైన ఆయన మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ సుబ్బారాయుడికి ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.