Cyber Crime: ఒక్కటి చెప్పనా బంగారం, పెట్టుబడి పెడితేనే కదా డబ్బులు వచ్చేదీ- సైబర్ నేరగాళ్ల టెంప్టింగ్ పోస్టులు
సైబర్ నేరగాళ్లు బంగారం మార్కెట్‌పై కన్నేశారు. పసిడిపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. గొల్డ్ ట్రేడింగ్ పేరుతో డబ్బు దోచుకుంటున్నారు.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ సాయంతో అమాయకులకు వల వేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. చదువు లేని వారు.. ఉన్నత స్థానంలో ఉన్నవారు అని తేడా లేకుండా అందర్నీ మోసం చేస్తున్నారు. గతంలో ఇమెజేలు, లింకులు, ఫోన్ కాల్స్ రూపంలో డబ్బు దోచుకున్నారు. ఆ తర్వాత పార్ట్‌టైమ్ జాబ్స్, క్రిప్టో ట్రేడింగ్ పేరుతో ఛీటింగ్ చేశారు. ఇప్పుడు... కొత్త రూట్‌లో భారీ మోసాలను ప్లాన్ చేశారు. అత్యాశకుపోతున్న చాలా మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
బంగారం మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో నయా దందా మొదలుపెట్టారు సైబర్ నేరగాళ్లు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నారు. ఆ నెంబర్ నుంచి మెసేజ్‌లు పంపుతూ.. ఆకర్షిస్తున్నారు. అమ్మాయి ఫొటో చూడగానే... మెసేజ్ ఓపెన్ చేసి చూస్తారన్నది వారి ప్లాన్. మొదటి దశలో చాలా మంది వారి వలలో పడుతున్నారు. ఆ తర్వాత.. బంగారం మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారిని నమ్మించి ట్రాప్ చేస్తున్నారు.
ప్రస్తుతం బంగారం మార్కెట్ ఫుల్ రేజ్‌లో ఉంది. పెట్టుబడి పెడితే లాభాలే తప్ప.. నష్టాలు ఉండవు. అందుకే చాలా మంది బంగారం మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఎలా పెట్టాలి... ఎవరిని సంప్రదించాలి అన్నది ఎక్కువ మంది తెలియదు. ఇదే అవకాశంగా మలుచుకున్నారు కేటుగాళ్లు. అలాంటి వారికి వల వేస్తున్నారు. బంగారం మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టండి అంటూ వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. పెట్టుబడులు పెడితే రోజుకు రూ.5 లక్షల వరకు సంపాదించవచ్చు.. అంటూ నమ్మిస్తున్నారు. వెతకబోయిన కాలి దగ్గరకే వచ్చిందని.. భావించేలా చేస్తున్నారు. కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోయారు... మోసపోతున్నారు.
గోల్డ్ ట్రేడింగ్‌పై చర్చించేందుకు వాట్సాప్ గ్రూప్‌లోకి రండి.. అంటూ మెసేజ్ ద్వారా ఆహ్వానిస్తున్నారు. నిజమని నమ్మిన చాలా మంది వాళ్ల ఉచ్చులో పడుతున్నారు. వాళ్లు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు. ట్రేడింగ్ కోసం డబ్బులు డిపాజిట్ చేయమంటే... చేస్తున్నారు. నేరగాళ్లు ముందు లాభాలు వచ్చినట్టు చూయించడంతో.. నమ్మిస్తున్నారు. నిజంగా లాభాలు వస్తున్నాయని నమ్మిన బాధితులు సంతోషంతో పొంగిపోతున్నారు. అత్యాశతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా కోట్లకు కోట్లు దోచేస్తోంది సైబర్ గ్యాంగ్
పెట్టుబడులు, వచ్చిన లాభాలను స్క్రీన్‌పై చూపిస్తున్న మోసగాళ్లు... వాటిని డ్రా చేసేందుకు మాత్రం అవకాశం కల్పించడంలేదు. డబ్బులు డ్రా చేసుకోవాలని బాధితులు కోరగా... పన్నుల పేరుతో మరింత డబ్బు కట్టాలంటూ మోసగిస్తున్నారు. బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో... బంగారం మార్కెట్ పేరుతో జరుగుతున్న మోసాలు బయటపడుతున్నాయి.
బాధితుల నుంచి సేకరించిన డబ్బంతా క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు మోసగాళ్లు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు దృష్టిసారించారు. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో మోసం చేస్ఉతన్న ముఠాలను అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. రాత్రి రాత్రి డబ్బు సంపాదించాలన్న అత్యాశే.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడేలా చేస్తోందని అంటున్నారు.