Chittoor News : చిత్తూరు జిల్లాలో కీచక టీచర్, అశ్లీల వీడియోలు చూపిస్తూ చిన్నారులపై లైంగిక దాడి
Chittoor News : చిత్తూరు జిల్లాలో కీచక టీచర్ ఉదంతం వెలుగుచూసింది. ఆరు నెలలుగా విద్యార్థులను టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడు. చిన్నారులకు అశ్లీల వీడియో చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
Chittoor News : గురువులు సరస్వతి స్వరూపం అంటారు పెద్దలు. లోకానికి పరిచయం చేసేది తల్లిదండ్రులు అయితే, విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే. గురువులు చెప్పే ప్రతి మాట జీవిత సత్యంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల తరువాత స్థానం గరువులకే ఇచ్చారు. అలాంటి స్థానంలో ఉన్న ఓ గురువు కీచకుడిగా మారాడు. అభం శుభం తెలియని విద్యార్థినులతో అసభ్యకర ప్రవర్తనతో, లైంగిక దాడులకు ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కీచక టీచర్
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం చిల్లకగుంటపల్లె గ్రామంలోని ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు అబ్బు(57) పాఠశాలోని విద్యార్థిని, విద్యార్ధులకు బోధన చేస్తూనే తన కామ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేశాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. నాలుగో, ఐదో తరగతి చదువుతున్న చిన్నారులు అయితే ఎవరికి చెప్పకుండా ఉంటారని భావించి స్కూల్ తలుపులు వేసి వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. పాఠాల పేరుతో వారిపై వేయకూడని చోట చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. చిన్నారులకు అశ్లీల చిత్రాలు సైతం చూపించేవాడు. అంతే కాకుండా స్కూల్ లోని ఛాక్ ఫీస్ తో మాలను తయారు చేసి చిన్నారులకు ఫౌడర్ రాసి, బొట్టు పెట్టి వివాహం చేసుకుంటానని వేధించాడు. దీంతో రోజు రోజుకి ఉపాధ్యాయుడి వేధింపులు ఎక్కువ కావడంతో అవి భరించలేని చిన్నారులు శుక్రవారం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ బాగోతం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ చంద్రశేఖర్, సర్పంచ్ దీపాలు ఈ విషయాన్ని కలెక్టర్ హరినారాయణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడిపై ఆగ్రహించిన కలెక్టర్ విచారణకు ఆదేశించాడు. అప్పటికే విషయం తెలుసుకున్న కీచకుడు అబ్బు పరారయ్యాడు. దీంతో పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు కీచకుడిని వెతికే పనిలో పడ్డారు. అయితే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కీచక టీచర్ అబ్బును కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరు నెలలుగా లైంగిక వేధింపులు
ఆరు నెలలుగా చిన్నారులపై టీచర్ అబు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించినట్లు చిన్నారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, హెచ్ఎమ్ చొరవతో కీచక టీచర్ ఉదయం వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్‌లో నీలి చిత్రాలు చూడమని చిన్నారులను టీచర్ అబు ఒత్తిడి చేసేవాడని తెలుస్తోంది. విద్యార్థులు మరుగుదొడ్లకు వెళితే లోపలికి వెళ్లి గడియపెట్టి వారిని లైంగికంగా వేధించేవాడని చిన్నారులు తెలిపారు. చివరకు ఉపాధ్యాయుడి వికృత చేష్టలు గమనించిన పాఠశాల హెచ్ఎమ్ అసలు విషయం తల్లిదండ్రుల వరకు చేరింది. ఆగ్రహంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తల్లిదండ్రులతో విద్యాశాఖ అధికారులు చర్చించారు. విషయం తెలుసుకున్న అబు పరారీలో ఉన్నాడు. ఉపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్ వేసింది.