Chittoor Crime: పొట్టేలు బదులుగా మనిషి తల నరికిన కేసులో ఊహించని ట్విస్ట్, అసలు కారణం ఇదే
Madanapalle Murder Case: చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన తలారి సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత మద్యం మత్తులో హత్య జరిగిందని గ్రామస్తులు భావించారు.
Madanapalle Murder Case: ఇటీవల జంతుబలి చేయబోతే నరబలిగా మారడం ఏపీలో సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన తలారి సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత మద్యం మత్తులో హత్య జరిగిందని గ్రామస్తులు భావించారు. పోలీసులకు అదే విషయం చెప్పారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెల్లడైంది.
మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లెలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. కానీ సంక్రాంతి సంబరాలు విషాదాన్ని నింపాయి. గ్రామ దేవతలకు జంతుబలి ఇచ్చే సమయంలో ఓ తలారి మరో తలారి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. అయితే ఇది పొరపాటున మద్యం మత్తులో జరిగి ఉంటుందని అంతా భావించారు. కానీ ఉద్దేశపూర్వకంగానే హత్య చేయాలని చూసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వలసపల్లె గ్రామస్తులు ప్రతి ఏడాదిలాగే చందాలు వేసుకున్నారు. గ్రామదేవతకు పొట్టేలును బలి ఇచ్చేందుకు జనవరి 16న అంతా సిద్ధం చేసుకున్నారు. అక్కడే అసలు వివాదం మొదలైంది.
తాను పొట్టేలును బలి ఇస్తానని తలారి సురేష్ సిద్ధమయ్యాడు. అయితే నువ్వు చందా కూడా ఇవ్వలేదు, బలి ఇచ్చేందుకు తయారయ్యావా అని అతడి పెద్దనాన్ని కుమారుడు తలారి చలపతి సురేష్‌ను వారించాడు. చెప్పిన వెంటనే పక్కకు వెళ్లలేదు, మరోవైపు డ్రమ్స్ వాయిద్యాల శబ్ధాలు ఇబ్బంది పెడుతుంటే సురేష్ మాత్రం ఎంచక్కా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన తలారి చలపతి అవకాశం కోసం ఎదురుచూశాడు. పొట్టేలు తలను నరికి గ్రామదేవతకు బలి ఇవ్వడానికి బదులుగా తలారి సురేష్ మెడపై కత్తితో ఒక్క వేటు వేసి తల నరికే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి తీవ్రరక్తస్రావం అవుతున్న సురేష్‌ను మదనపల్లె ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే అతడు చనిపోయాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం హంద్రీనీవా కాలువ వద్ద నిందితుడు చలపతిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. చందా వివాదం, పొట్టేలు బలి ఇస్తానని ముందుకు రావడం వంటి కారణాలతో తలారి సురేష్‌ను హత్యచేసినట్లు చలపతి అంగీకరించడంతో పోలీసులు షాకయ్యారు. సురేష్ హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడు చలపతిని అరెస్ట్ చేసిన మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై చంద్రశేఖర్‌ను డీఎస్పీ రవి మనోహరాచారి అభినందించారు.
Also Read: Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ
Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..