(Source: ECI/ABP News/ABP Majha)
Chittoor Crime News: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య- దారిదోపిడీ నాటకంతో ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ !
Chittoor Crime News: చిత్తూరు జిల్లాలో జరిగిన దోపిడీ కట్టుకథే అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్యే చేసిందని వివరించారు.
Chittoor Crime News: చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన దారి దోపిడీ కేసు అంతా కట్టుకథే అని పోలీసులు తెలిపారు. ఈ హత్యకేసులను చాలా తొందరగానే ఛేదించారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో దోపిడీ దొంగలు కళ్లలో కారం కొట్టి భర్తను హత్య చేసి, భార్య వద్ద ఉన్న నగలతో ఉడాయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ హత్యను దోపిడీ దొంగలే చేశారని పోలీసులు భావించారు. కానీ కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో కీలక సూత్రధారి భార్యే అని నిర్ధారణకు వచ్చారు. హత్యకు గల కారణాలు తెలిసి విస్తుపోయారు.
భర్తకు తెలియకుండా నగలు ప్రియుడి చేతికి..
పెనుగొలకల గ్రామానికి చెందిన అనురాధకు, బత్తలపురానికి చెందిన దామోదర్ తో 2019లో వివాహం జరిగింది. అయితే అనురాధకు పెళ్లికి ముందే .. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న గంగరాజుతో వివాహం జరిగింది. అయితే పెళ్లయ్యాక కూడా ఆమె తన ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. అంతేకాకుండా ఆమె నగలను భర్తకు తెలియకుండా.. ప్రియుడికి ఇచ్చేసింది. అయితే తాజాగా అనురాధ అత్తమామలు.. పండుగకు వెళ్లినప్పుడు తీసుకొస్తానని చెప్పి తప్పించుకుంది. అత్తింటి వాళ్లు, భర్త.. నగల గురించి అడుగుతున్నారని.. తనకు వాళ్లతో ఉండటం ఇష్టం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి ఓ పథకం వేసింది.
పథకం ప్రకారం మొన్న పుట్టింట్లో నోములు ముగించుకొని భర్తతో బయలుదేరిన అనురాధ.. తన ప్రియుడికి సమాచారం అందించింది. అప్రమత్తమైన ప్రియుడు.. ఇటుక నెల్లూరు వద్దకు చేరుకోగానే దామోదర్ పై దాడి చేసి కళ్లలో కారం కొట్టి హత్య చేశాడు. అనంతరం అనురాధ వద్ద ఉన్న నగలతో ఉడాయించాడు. పథకం ప్రకారం దుండగులు హత్య చేసి నగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయట పడిందని పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. నిందితులు గంగరాజు, అనురాధలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
20 రోజుల క్రితం భార్య ప్రియుడిని హత్య చేసిన భర్త.
నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లకు చెందిన అశోక్, ప్రసాద్ స్నేహితులు. ప్రసాద్ భార్యతో అశోక్ కి అక్రమ సమబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా వారి స్నేహం చెడిపోయింది. ప్రసాద్, అశోక్ మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. కానీ ఆ తర్వాత ప్రసాద్ మెల్లగా ఓ పథకం పన్నాడు. మంచిగా ఉన్నట్టు నటించి అశోక్ ని అంతమొందించాలనుకున్నాడు. అశోక్ తో స్నేహం నటించాడు. చివరకు ఇద్దరూ కలసి నెల్లూరు జిల్లాకు పని కోసం వచ్చారు. నాపరాళ్ల లోడుతో నెల్లూరు జిల్లాకు వచ్చారు.
నంద్యాల జిల్లా నుంచి నాపరాళ్ల లోడుతో లారీ బయలుదేరింది. కలువాయిలో ఆ రాళ్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దారిలో లారీ ఆపి అశోక్, ప్రసాద్ మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరూ లారీపైకి ఎక్కి పడుకున్నారు. అయితే ప్రసాద్ వ్యూహం ప్రకారం మద్యం తాగకుండా నిద్ర నటించారు. అశోక్ బాగా నిద్రలోకి జారుకున్న తర్వాత అతడిని తలపై నాపరాళ్లతో కొట్టి చంపాడు. అశోక్ చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత లారీ కదులుతుండగానే అతడిని రోడ్డుపై వదిలేశాడు. వెనక లారీ వస్తుండటం చూసి సరిగ్గా లారీ కింద పడేట్లు శవాన్ని తోసేశాడు. ఆ లారీకింద పడి అశోక్ శరీరం నుజ్జునుజ్జయింది.
మొదట రోడ్డు ప్రమాదంగా అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత తమతోపాటు పనికి వచ్చిన వ్యక్తి కనిపించడంలేదంటూ లారీతోపాటు వచ్చినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసాద్ వ్యవహారం అనుమానంగా ఉండటంతో అతడిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరకు ప్రసాద్ నిజం ఒప్పుకున్నాడు. తన భార్యతో అశోక్ కి అక్రమ సంబంధం ఉందని, అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. అశోక్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ ని అరెస్ట్ చేశారు.