Chittoor: ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి, పోలీసుల అదుపులో నిందితుడు
చిత్తూరులో దారుణమైన ఘటన జరిగింది. ఓ మృగాడు ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మహిళలు, చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాలు. నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టేందుకు ఎన్నో చట్టాలు తెచ్చినా కామాంధులకు ఆగడాలకు అడ్డుకట్టపడడంలేదు. దిశ పోలీసు స్టేషన్లు, యాప్ లు ఉన్నా అవి క్షేత్రస్థాయిలో ప్రభావితం చూపలేకపోతున్నాయి. ఇటీవల విజయవాడలో బాలికపై ఓ రాజకీయ పార్టీ నేత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరికి ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చిత్తూరు జిల్లా ఎనిమిదేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్లితే చిత్తూరు(Chittoor) జిల్లా కేంద్రంలో ఓ కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తేతో కలిసి జీవనం సాగిస్తుంది. భర్త లేక పోవడంతో కుమార్తెను ఇంటి వద్దే వదిలి కూలీ పనులు చేస్తూ కుమార్తేను చదివించుకుంటుంది. అయితే నాలుగు రోజుల క్రితం కుమార్తెను ఇంటి వద్దే వదిలి వేరే కాలనీకి పనికి వెళ్లింది మహిళ. ఇంటి వద్ద తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలిక బహిర్భూమికి ఇంటి సమీపంలోని పొదల వద్దకు వెళ్లింది. బాలిక వెళ్లడాన్ని గమనించాడు అక్కడే నివాసం ఉంటున్న నాగరాజు(39) అనే వ్యక్తి. బాలికకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు నాగరాజు. ఆపై బాలికపై లైంగిక దాడి చేశాడు.
పోలీసుల అదుపులో నిందితుడు
బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాలిక ఇంటికి చేరుకుంది. అయితే తల్లికి బయపడి జరిగిన ఘటనను చెప్పలేక పోయింది. బాలిక ఆర్యోగం బాగోకపోవడంతో గమనించిన బాలిక తల్లి చిత్తూరు టూ టౌన్(Chittoor Two Town) పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న నాగరాజు పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తు్న్నారు. బాలికను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నిందుతుడిపై పోక్సో చట్టం(Pocso Act) కింద కేసు నమోదు చేశామని చిత్తూరు టూటౌన్ పోలీసులు పేర్కొన్నారు. చిత్తూరు నగరానికి శివారు ప్రాంతమైన మురకం వద్ద నిందుతుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు బాలికను పరామర్శించి నిందుతుడి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: వంద రెండు వందలు కాదు ఏకంగా రెండు లక్షల కేజీలు - గంజాయి కేసుల్లో ఏపీ పోలీసుల సంచలనం !