Ganja : వంద రెండు వందలు కాదు ఏకంగా రెండు లక్షల కేజీలు - గంజాయి కేసుల్లో ఏపీ పోలీసుల సంచలనం !
Ganja : విశాఖ మన్యంలో గంజాయి పంటలను ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్న పోలీసులు రెండు లక్షల కేజీల గంజాయికి నిప్పు పెట్టారు.
దేశంలో ఎక్కడ గంజాయి లోడ్ దొరికినా అది విశాఖ మన్యం ప్రాంతం నుంచే వస్తోందని అక్కడి పోలీసులు ప్రకటించడం కామన్ అయిపోయింది. ఈ చెడ్డపేరును తుడిచేసుకోవడానికి ఏపీ పోలీసులు అసలు సమస్య మూలం మీదనే దృష్టి పెట్టారు. అసలు గంజాయి పంట పండించకుడా చేస్తే సమస్యే రాదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారు గత కొంత కాలంగా చేసిన ప్రయత్నాలతో లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి మంట పెట్టి బుగ్గి చేశారు.
గతేడాది నవంబర్ నుంచి ఈనెల వరకు పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐటీడీఏ అధికారులు కలిసి ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. మన్యంలో మరుమూల గ్రామాల్లో రైతులు పండిస్తున్న 8500 ఎకరాల్లోని గంజాయి పంటను ధ్వంసం చేశారు. గంజాయి దాదాపు 2 లక్షల కిలోలు ఉంటుంది, దీని విలువ రూ.9250 కోట్ల వరకు ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో అనకాపల్లి సమీపంలోని కోడూరు వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో గంజాయికి నిప్పు పెట్టారు. ఒడిశా లోని 23 జిల్లాలు.విశాఖ గ్రామీణ ప్రాంతాలలోని 11 మండలాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది. ఇప్పటికే 11 మండలాల పరిథి లోని 313 శివారు గ్రామాల్లోని 7552 ఎకరాల్లో 9251.32 కోట్ల విలువ చేసే గంజాయి సాగును నాశనం చేశారు.
పలు రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఏవోబి లో యదేచ్చగా గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని గంజాయి ని సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని డీజీపీ తెలిపారు. గంజాయి స్మగ్లర్లు దేశ వ్యాప్తంగా ఉన్నారు...అన్ని విధానాలు అయిన మార్గాలు ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని .. మావోయిస్టులు గంజాయి పండించేందుకు సహకరిస్తున్నారు..దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. విశాఖ మన్యంలో మావోయిస్టుల సహకారంతోనే గంజాయి సాగు జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. అందుకే భారీగా గంజాయి సాగు జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరిపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొందరు వ్యాపారులు, మావోయిస్టుల మాటలను నమ్మి అక్కడి ప్రజలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తుంటారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలను గంజాయి సాగు నుంచి ఇతర పంటల వైపు మరల్చేందుకు పోలీసు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గంజాయి దేశంలో అతి పెద్ద సమస్యగా ఉంది. గంజాయి మత్తుకు యువత నిర్వీర్యం అయిపోతోంది. ఈ కారణంగా గంజాయి ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఆ ప్రాంతాల్లోనే కట్టిడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నారు. ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నారు. గంజాయి రవాణాను పోలీసులు అరికట్టగలిగితే అది వారికి భారీ విజయం అవుతుంది. ఆ దిశగా అడుగు ముందుకేశారని అనుకోవచ్చు.