FedEx Scam : ఫెడెక్స్ పేరుతో వందల కోట్లు మోసాలు - అసలు మోసగాళ్లకు మన డేటా ఎలా వెళ్తోంది ?
Online Scam : ఫెడెక్స్ కొరియర్ల పేరుతో మోసం చేయడం పెద్ద స్కామ్ గా మారింది. ప్రతి రోజూ వందల మంది మోసపోతున్నారు.
Big Scam With Name FedEx couriers : ఫెడెక్స్ కొరియర్స్ అంటే ఇంటర్నెషనల్ కొరియర్స్ కంపెనీ. ఈ పేరుతో మీకు పార్సిల్ వచ్చిందని.. ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే మాత్రం అది కచ్చితంగా ఫేకే. పైగా డెలివరీ ఇస్తామని కాకండా.. పార్సిల్ ను కస్టమ్స్ దగ్గర ఆగిపోయిందని.. కొంత డబ్బులు కట్టాలని అడిగితే.. మాత్రం మరో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడే ఈ స్కామర్లు భారీ తెలివి తేటల్ని ప్రదర్శిస్తుతున్నారు. నిషేధ వస్తువులు పార్శిల్‌లో ఉన్నాయని.. ఈడీ, సీబీఐ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక చాలా మంది డబ్బులు కట్టేస్తున్నారు.
కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని మరీ మోసాలు
ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆన్ లైన్ లో ఆర్డర్లు బుక్ చేసుకున్న్ వారి వివరాలు సేకరించి..వారి ఆర్డర్ షిప్పింగ్ లో ఉన్నప్పుడు ఇలా ఫోన్లు చేస్తున్నారు. తాము ఇచ్చిన ఆర్డర్ ఫెడెక్స్ లో వస్తుందేమో అనుకుని ఎక్కువ మంది కంగారు పడుతున్నారు. ఇలాంటి స్కాములు జరుగుతాయని తెలియకపోవడం.. ఈడీ , సీబీఐ పేరుతో కూడా బెదిరించేందుకు వెనుకాడకపోవడంతో చాలా మంది మోసపోతున్నారు. చివరికి వీరు డిజిటల్ అరెస్టు పేరుతో కూడా బయపడుతున్నారు. మాముగా అయితే ఇలాంటి స్కాముల్ని ఈజీగా కనిపెట్టవచ్చు. కానీ ఈ నేరాలకు పాల్పడేవారు.. మాటలతోనే భయపెడుతున్నారు. ఫలితంగా ఎక్కువ మంది మోసపోతున్నారు.
భయపెట్టి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడంలో మోసగాళ్లకు ప్రత్యేక నైపుణ్యం
ఈ స్కామర్లు ఫెడెక్స్ కంపెనీ పేరుతో ఇంత ఘోరంగా వాడుకుంటూ ఉండటంతో ఆ కంపెనీకి కూడా చిరాకొచ్చి.. ఓ సారి పేపర్ ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ఫెడెక్స్ కంపెనీ పేరుతో ఫోన్ చేసి.. పార్శిల్ ఆగిపోయిందని చెబితే నమ్మవద్దని.. విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ స్కామర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. మెట్రో నగరాల్లోనే కాదు.. ఫోన్ నెంబర్ దొరికితే.. పల్లెల్లోని వారికీ కాల్ చేస్తున్నారు. అమాయకులు దొరికితే ఎంత పెద్ద మొత్తంలో పిండుకోవాలో... అంత పిండుకుంటున్నారు. వారి జేబుల్ని గుల్ల చేసిన తర్వాత ఫోన్ నెంబర్లు డిస్ కనెక్ట్ చేస్తున్నారు.
మన డేటాను అమ్ముకునేవారి వల్లే అసలు సమస్య
వీరు ఇలా మోసం చేయగలుగుతున్నారంటే దానికి కారణం ప్రజల ఫోన్ నెంబర్లు, వారు ఆన్ లైన్ షాపింగ్ హిస్టరీ కూడా తెలిసి ఉండటమే. ఇలాంటి డేటా మోసగాళ్లకు ఎలా చేరుతుందన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఓ వ్యక్తి అమెజాన్ లో ఎదైనా ఆర్డర్ పెడితే.. ఆ వ్యక్తికి ఫెడెక్స్ పేరుతో కాల్ వస్తోంది. ఒక్క అమెజాన్ మాత్రమే కాదు.. ఇతర షాపింగ్ సైట్లలో ఆర్డర్స్ ఇచ్చిన వారికీ ఇదే పరిస్థితి. తాము ఆర్డర్ ఇచ్చాం కదా అదేనేమో అని ఎక్కువ మంది భ్రమపడి.. తప్పు చేశామేమో అన్న భవనతో ఎక్కువగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ అంశంపై ఎంత ప్రచారం చేసినా...మోసగాళ్ల బారిన పడేవారు పడుతూనే ఉన్నారు. మన డేటాకు భద్రత ఉంటే... ఇలాంటి కాల్స్ వచ్చే అవకాశమే లేదని.. ఉద్దేశపూర్వకంగా డేటా అమ్ముకునే ఆన్ లైన్ సైట్ల వల్లే ఈ సమస్య వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.