Kolkata: కోల్‌కతా కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్, నిజాలు బయటకు వస్తాయా?
Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ విచారణను మరింత వేగవంతం చేయనుంది.
Kolkata Doctor Murder Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిన అవసరముందని, అందుకు అనుమతి కావాలని సీబీఐ..కోర్టుని కోరింది. ఈ మేరకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రమంలో కోర్టు కూడా వేగవంతంగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. తానే ఈ నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది.
CBI has got permission to conduct polygraph test of the arrested accused in Kolkata hospital rape-murder case: CBI sources
— ANI (@ANI) August 19, 2024
ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం కనిపించింది. సెమినార్ హాల్‌లో అర్ధనగ్నంగా ఉన్న డెడ్‌బాడీని చూసి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కొన్ని గంటల తరవాత సమాచారం అందించారు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హాస్పిటల్‌కి వచ్చాక మూడు గంటల పాటు కూర్చోబెట్టి ఆ తరవాత డెడ్‌బాడీని చూపించారు. అయితే..ఇది హత్య అన్న నిజాన్ని దాచిపెట్టారు. హత్యాచారం జరిగినట్టు ఆ తరవాత చెప్పారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు. ఈ కేసులో ఆర్‌జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ని విచారిస్తున్నారు. మూడు రోజులుగా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది.