Hyderabad Drugs Case: నగరంలో మరో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు- సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు అరెస్ట్
Telangana Anti Narcotics Bureau | ద కేవ్ పబ్ పై ఆకస్మిక దాడులు చేపట్టిన పోలీసులు, టీన్యాబ్ అధికారులు 55 మందిని అదుపులోకి తీసుకుని, టెస్టులు చేపించగా 25 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది.
Cave Pub Drugs case | హైదరాబాద్: నగరంలోని ఓ పబ్‌లో సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఖాజాగూడలోని ద కేవ్ పబ్ (The Cave Pub)లో రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు, టీజీ న్యాబ్ (Telangana Anti-Narcotics Bureau) సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కేవ్ పబ్‌లో అదుపులోకి తీసుకున్న వారికి టెస్టులు నిర్వహించగా మొత్తం 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలింది. డీజే నిర్వాహకుడు ఆయూబ్ సహా మరో 23 మంది మత్తు పదార్థాలు తీసుకోగా, వీరిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. పబ్ ఓనర్లు రాజేష్, అభినవ్, సాయి క్రిష్ణ, సన్నీ పరారీలో ఉన్నారు. గౌరంగ్ ఈ పార్టీకి డీజే ప్లేయర్ కాగా, శేఖర్ మేనేజర్ గా వ్యవరించాడని పోలీసులు గుర్తించారు.
కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబందించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. ‘ఖాజాగూడలోని ద కేవ్ పబ్‌లో స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి బెంగుళూరు నుండి డీజేను తీసుకొచ్చారు. డ్రగ్స్ తీసుకురావాలి అనేది పార్టీ థీమ్. ఓ ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకి ఆహ్వానాలు పంపించారు. అరెస్టైన వారిలో డ్రగ్స్, గంజాయి సేవించిన వారు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కొందరు విద్యార్థులు ఉన్నారు. ఎక్కువ గంజాయి ఎవరు సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి అని ప్రకటించారని’ తెలిపారు.
పబ్ సీజ్ చేసి, లైసెన్స్ రద్దు
పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ద కేవ్ పబ్ సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ అని ప్రచారం చేస్తారు. పక్కా సమాచారంతో ద కేవ్ పబ్ మీద తెలంగాణ నార్కోటిక్, రాయదుర్గం పోలీసులు, ఎస్వోటీ దాడులు చేసి 55 మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు చేపించగా.. ఇరవై నాలుగు మందికి డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. మిగతా పబ్‌లలోనూ ఆకస్మిక దాడులు చేయనున్నాం. అనుమానం వచ్చిన వారిపై అక్కడే బ్లడ్, యూరిన్ టెస్టులు జరిపిస్తామన్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తాం, అవేర్ నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని చెప్పారు.