Bus Fire Accident: ప్రైవేటు బస్సులో మంటలు, పూర్తిగా దగ్ధం అయిన బస్సు, ప్రయాణికులు సేఫ్!
Bus Fire Accident: అర్ధరాత్రి ప్రయాణికులు బస్సులో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు క్షేమంగా బయటపడగా.. బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Bus Fire Accident: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి ఓ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపేసి.. ప్రయాణికులందరినీ కిందకు దింపేశాడు. దీని వల్లే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కానీ బస్సు, అందులో ఉన్న సామాన్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో 29 మంది మంది ప్రయాణికులు ఉన్నారు. పూజా ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు నాగ్ పూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తోంది. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
అయితే హుటాహటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైర్ ఇంజిన్లతో వచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులో షాట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రయాణికులంతా క్షమేంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మంటలు చెలరేగిన క్రమంలో ప్రయాణికులు బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలివేయడంతో అవన్నీ కూడా కాలి బూడిద అయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పవురురు ప్రయాణికులు చెప్పారు.
నెల రోజల క్రితం జనగామలో ప్రైవేటు బస్సు దగ్ధం..
జనగామ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు అగ్నికి ఆహుతైంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో పొగ రావడం గమనించి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 26 మంది ప్రయాణికులు సకాలంలో సురక్షితంగా బయటపడగలిగారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగుతుండడం వల్ల అగ్ని మాపక సిబ్బందికి ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా సేపు ప్రయాణికులు రోడ్డుపైనే ఉన్నారు. అనంతరం మరో బస్సును రప్పించి వారిని అందులో ఎక్కించి గమ్యస్థానానికి పంపించారు.
కృష్ణా జిల్లా ఆర్టీసీ బస్సులోనూ ప్రమాదం..
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ లో నుంచి మొదలైన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో బస్సు కాలి బూడిదైంది. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులు విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 60 మంది బస్సులో ఉన్నారు. ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై బస్సును నిలిపి వేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన క్రమంలోనే బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలివేయడంతో అవన్నీ కూడా కాలి బూడిద అయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పవురురు ప్రయాణికులు చెప్పారు.
అయితే బస్సు దిగిన వెంటనే చాలా దూరంగా పరుగులు పెట్టారు. అంతా దూరంగా నిల్చొని బస్సు కాలిపోవడాన్ని కళ్లారా చూశారు. అప్పటికే పలువురు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. అలాగే పోలీసులు కూటా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.