Atiq, Ashraf Shot Dead: అతిక్, అష్రఫ్ హత్యపై రిపోర్ట్ - హోం శాఖకు పంపిన యూపీ సర్కార్
Atiq, Ashraf Shot Dead: అతిక్, అష్రఫ్ హత్య కేసుపై పూర్తిస్థాయి నివేదికను యూపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు అందించింది.
Atiq, Ashraf Shot Dead:
హోం శాఖకు రిపోర్ట్
అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మీడియా రిపోర్టర్ల ముసుగులో వచ్చి ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరినీ హత్య చేశారు ముగ్గురు దుండగులు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. 2 గంటల్లోగా రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఆ రిపోర్ట్‌ని సబ్మిట్ చేసింది. హోం మంత్రిత్వ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్‌తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే...ఈ రిపోర్ట్‌లో ఏముందన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ హత్య ఎలా జరిగింది..? ఎవరు చేశారు..? ఈ హత్య జరిగిన వెంటనే యూపీ ప్రభుత్వం ఎలా స్పందించింది..? తదితర వివరాలు ఆ రిపోర్ట్‌లో ఉన్నట్టు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ అన్ని మీటింగ్‌లు రద్దు చేసుకుని పూర్తిగా ఈ ఘటనపైనే దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ బీజేపీ నేతలతో మీటింగ్ అవ్వాల్సి ఉన్నా క్యాన్సిల్ చేశారు యోగి. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మంత్రులనూ బందోబస్తు పెంచారు. ప్రస్తుతానికి ఎవరూ ఎవరినీ కలవడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. విచారణలో ఎవరి జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇదీ జరిగింది..
ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న అతీక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో గురువారం నాడు అతీక్ కుమారుడు అసద్, మరో నిందితుడు పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ధూమంగంజ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ అతీక్, అతడి సోదరుడిని మెడికల్ టెస్టుల కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తో పాటు అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ మరణించాడని పోలీసులు చెబుతున్నారు. దుండగులు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ కాల్పులకు తెగబడ్డారని పీటీఐ రిపోర్ట్ చేసింది. చాలా దగ్గరి నుంచి నిందితులపై కాల్పులు జరిగాయని తెలుస్తోంది. గురువారం ఎన్ కౌంటర్ లో చనిపోయిన అతీక్ కుమారు అసద్ అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. కొన్ని గంటల వ్యవధిలోనే గ్యాంగ్ స్టర్ అతీక్ అతడి సోదరుడు దారుణహత్యకు గురికావడం, అందులోనూ పోలీసుల సమక్షంలో పాయింట్ బ్లాంక్ రేంజీలో కాల్పులు జరపడం యూపీలో హాట్ టాపిక్ గా మారింది.అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్ చేయడం తెలిసిందే. అసద్ తో పాటు మరో నిందితుడు గుల్హామ్ సైతం ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో చేసిన ఎన్‌కౌంటర్ అసద్, గుల్హామ్ చనిపోయారని పోలీసులు గురువారం ప్రకటించారు.