Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!
Bullet Bikes Thieves: ఆ యువకులిద్దరికీ బైకులంటే ఇష్టం. అందులోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులంటే పిచ్చి. ఎక్కడ బుల్లెట్ బైకులు కనిపించినా వాటిని పట్టుకుపోతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే?
Bullet Bikes Thieves: బైకులంటే ఇష్టపడని యువకులు ఉండరు. ప్రతీ ఒక్క యువకుడికీ కొత్త, స్టైలిష్ బైకుపై రయ్ రయ్ మంటూ తిరగాలని ఉంటుంది. వెనకాల గర్ల్ ఫ్రెండ్ ను కూర్చోబెట్టుకొని రౌండ్ల మీద రౌండ్లు వేయాలనుకుంటారు. అందుకోసం ఎంతైనా కష్టపడతారు. ప్రతీ అబ్బాయికి తన మొదటి ద్విచక్ర వాహనం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక బండిలేని వారైతే మరీ స్నేహితుల వాహనాలు చూస్తూ బాధపడుతుంటారు. ఒక్క రైడ్ కోసం బండి ఇచ్చినా చాలని కోరుకుంటారు. బతిమాలి అయినా సరే బండిపై రౌండ్లు వేస్తుంటారు. అయితే ఓ ఇద్దరు అబ్బాయిలు ఈ మధ్య తరచుగా కొత్త కొత్త బండ్లపై తిరుగుతున్నారు. ముందు పోలీసులు పట్టించుకోలేదు. కానీ రోజుకో కొత్త బైకు.. అందులోనూ అవన్నీ రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలే కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వీరి సంగతి తెలుసుకుందామని వారిపై కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఇంకేం ఉంది వారి బాగోతం తెలిసి షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
బైకులంటే వారికి ప్రాణం..
ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన నవీన్ బాబు, అదే ప్రాంతంలోని పాతూరికి చెందిన చల్లా భవానీ శంకర్ స్నేహితులు. అందరి యువకుల్లాగే వీరికి కూడా ద్విచక్ర వాహనాలంటే చాలా ఇష్టం. అందులోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ కు చెందిన బుల్లెట్ బైక్ లు అంటే వారికి మరింత ఇష్టం. ఆ ఇష్టమే వారిని జైలుకు వెళ్లేలా చేసింది. ఎలా అనుకుంటున్నారా.. వారు చేసిన దోపిడీ పర్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీరిద్దరూ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తారు. సినిమా మధ్యలో లేచి బయటకు వచ్చేస్తారు. అలా అని సినిమాలు నచ్చకో లేక బయట పని ఉండో వచ్చారు అనుకునేరు. అలా కాదులెండి.. పథకం ప్రకారమే బయటకు వచ్చే వాళ్లు.
రాష్ట్రంలో దాటించి అమ్మకాలు..
పట్టణం అంతా తిరుగుతూ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లను మాత్రమే హ్యాండిల్ లాక్ లను విరగ్గొట్టి దొంగతనం చేసే వారు. ఆ బైకులను మాచర్ల తీసుకు వెళ్లి.. అక్కడి నుండి వాహనాలను రాష్ట్రం దాటించి మరీ అమ్ముకునేవారు. ఎక్కువగా తెలంగాణకు వచ్చి విక్రయించారు ఆ ఇద్దరు దొంగ స్నేహితులు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే చిలకలూరి పేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన కనమర్ల పూడి పవన్ అనే వ్యక్తి బైక్ పోయింది. గత నెల 29వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దొంగతనం రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్లు బాధితుడు పవన్ తెలిపారు. తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నంబరు AP 39 HU 9600 అని తెలిపాడు. తన ఇంట్లోనే మరో పోర్షన్ లో ఉంటున్న మరో వ్యక్తికి చెందిన బైకును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. అతని బైక్ కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకే. అతని పేరు కొమ్మనబోయిన నాగ అనిల్. అనిల్ బుల్లెట్ బైక్ నంబరు AP 39 JX 2468. దీంతో నాగ అనిల్, పవన్ ఇద్దరూ వెళ్లి తమ బైక్ లను దొంగలు ఎత్తుకు పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ.11 లక్షల విలువైన బైకులు స్వాధీనం..
దొంగ స్నేహితులు మాచర్ల నవీన్ బాబు, చల్లా భవాని శంకర్ లను పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న దొంగలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 11 లక్షలు ఉంటుందని పోలీసులు అధికారులు తెలిపారు.