Medical Student Death: ‘జీవితంలో ఓడిపోయా, సారీ అమ్మా’- వైజాగ్ లాడ్జిలో మెడికో సూసైడ్
Medical Student Death: క్షణికావేశంలో యువత ప్రాణాలు తీసుకుంటోంది. విశాఖపట్నం నగరంలో డాబా గార్డెన్స్‌లో మెడికో ఆత్మహత్య చేసుకుంది.
Medical Student Death: క్షణికావేశంలో యువత ప్రాణాలు తీసుకుంటోంది. విశాఖపట్నం నగరంలో డాబా గార్డెన్స్‌లో మెడికో ఆత్మహత్య చేసుకుంది. హోటల్ గదిలో కేరళకు చెందిన రమేష్ కృష్ణ అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చింది. ఈనెల 13న తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్ చేరుకుంది. డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో అద్దెకు దిగి ఆగస్టు 19వ తేదీన గది ఖాళీ చేసింది. తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు. లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో అనుమానించిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని నిర్జీవంగా వేలాడుతున్నట్టు కనిపించింది. పక్కనే సూసైడ్ నోట్ కనిపించింది. అందులో మళయాలంలో.. జీవితంలో ఓడిపోయానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, సారీ అమ్మా అంటూ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై టూ టౌన్ సీఐ తిరుమలరావు మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కేరళకు చెందిన రమేష్ కృష్ణగా గుర్తించినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మృతురాలు ఒకే గదిలో రెండు సార్లు చెక్ ఇన్ చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 19న చెక్ అవుట్ చేసిన తర్వాత ఈనెల 23 వరకు ఎక్కడికి వెళ్లిందో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు వచ్చాక వారిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.