Phone Tapping Case నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదు
Telangana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు 8 మందిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
Taskforce former DCP Radhakishan Rao: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 8 మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు 386, 365, 341, 120బి రెడ్ విత్ 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. బిజినెస్ మ్యాన్ చెన్నుపాటి వేణు మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజా కేసు నమోదైంది. గతంలో ఓ వ్యక్తి తన కంపెనీలో కొన్ని షేర్లు కొని, చివరికి కంపెనీనే స్వాధీనం చేసుకునేందుకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు సాయంతో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..
చెన్నుపాటి వేణు మాధవ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. క్రియా పేరుతో 2011లో హెల్త్ కేర్ సర్వీసు ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీలో 165 హెల్త్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఖమ్మంలో టెలిమెడిసిన్, జాతీయ రహదారులపై ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసు వాహనాలు ఏర్పాటు చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెల్త్‌కేర్ సెంటర్ల ప్రాజెక్టు యూపీలో విస్తరించిన సమయంలో గోపాల్, రాజ్, నవీన్, రవిలను పార్ట్‌టైమ్ డైరెక్టర్లుగా నియమించి.... బాలాజీ అనే వ్యక్తిని సీఈవో పెట్టినట్లు వెల్లడించారు.
ఆపై చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి తమ కంపెనీల్లో షేర్లు కొనడంతో పాటు డైరెక్టర్లతో కుమ్మక్కై.. రూ.100 కోట్ల తన కంపెనీని లాక్కునే ప్రయత్నం చేశారని వేణు మాధవ్ ఆరోపించారు. బెదిరింపులకు లొంగకపోవడంతో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జున్‌ల సాయంతో తనను కిడ్నాప్ చేయించి డీసీపీ ఆఫీసులో హింసించారని తెలిపారు. చంద్రశేఖర్ వేగే చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని ఓ దశలో తనను బెదిరించినట్టు బాధిత వ్యాపారవేత్త వేణుమాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాకు విషయం చెప్పకూడదని హెచ్చరించారన్నారు. ఏం చేయాలో తెలియక సీఐ గట్టు మల్లు టీమ్‌కు తాను 10 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. గతంలో జరిగిన ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా.. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.