Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!
Annamayya District News : అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Annamayya District News : భార్యా భర్తల దాంపత్య జీవితం ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు నిదర్శనంగా ఉండాలంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇద్దరూ కలిసి ఎదుర్కొంటేనే ఆ జీవితం నిండు నూరేళ్లు సాగుతుంది. ఇక ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ మనస్పర్ధలు లేకుండా జీవితం సాగించాలి.. అంతే కానీ చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటే ఆ సంసారం కత్తి మీద సాముల మారుతుంది. భర్తతో గొడవ పడిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం దిగువ బురుజు పల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి, ఓబులేశ్వరి కుమార్తె లావణ్యను 2016లో పీలేరు మండలం దిగువపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డితో వివాహం జరిపించారు. లావణ్య, సుబ్రమణ్యం రెడ్డికి పరమేష్ (4), మౌనిక (3) పిల్లలు ఉన్నారు. అయితే లావణ్య భర్త సుబ్రహ్మణ్యం రెడ్డి వృత్తి రీత్యా తెలంగాణ మహబూబాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల్ల లావణ్య, సుబ్రహ్మణ్యం రెడ్డిల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో లావణ్య తల్లిదండ్రులు, సుబ్రహ్మణ్యం రెడ్డి తల్లిదండ్రులు కలిసి భార్య భర్తల మధ్య తగదాలను తీర్చే ప్రయత్నం చేశారు. కానీ ఇరువురు తరచూ చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం లావణ్య భర్తతో గొడవపడి పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుండి లావణ్య తన ఇద్దరు పిల్లలను తన వద్దే ఉంచుకుని ఉద్యోగం ప్రయత్నం చేస్తూ వస్తుంది.
ఇంటికి తిరిగి వస్తానని చెప్పి
ఈ నెల 16న లావణ్య తాత సురేంద్రరెడ్డి కర్మక్రియలకు సుబ్రహ్మణ్యం రెడ్డి మహబూబాబాద్ నుంచి దిగువ ఓబులవారిపల్లెకు వచ్చాడు. సురేంద్రరెడ్డి కర్మక్రియలు పూర్తైన తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి, తన భార్య, పిల్లలను తనతో పాటు పంపించాలని లావణ్య తల్లిదండ్రులను కోరాడు. సుబ్రమణ్యం రెడ్డి కోరిక మేరకు లావణ్యను కాపురానికి పంపేందుకు తల్లిదండ్రులు లావణ్యకు నచ్చజెప్పారు. కానీ లావణ్య భర్తతో వెళ్లడానికి నిరాకరించింది. పిల్లలనైనా తనతో పంపించాలని సుబ్రమణ్యం రెడ్డి కోరాడు. సుబ్రమణ్యం రెడ్డితో గొడవపడి లావణ్య పిల్లలను పంపించేందుకు నిరాకరించి భర్త మీద కోపంతో శుక్రవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలను బలవంతంగా వెంట బెట్టుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది లావణ్య. సుబ్రమణ్యం రెడ్డి, కొందరు గ్రామస్తులు వచ్చి లావణ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరూ ఎన్ని చెప్పినా లావణ్య ఏమాత్రం పట్టించుకోకుండా అందరూ తనను ఒంటరిగా వదిలి వెళ్లాలని చెప్పింది. ఒక నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని చెప్పడంతో లావణ్యను అక్కడే వదిలి వెళ్లిపోయారు.
బావిలో దూకి ఆత్మహత్య
అయితే ఎవరు లేని సమయంలో పిల్లలతో సహా లావణ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎంత సేపటికి లావణ్య రాకపోయే సరికి అనుమానం వచ్చిన గ్రామస్తులు అంతా గాలించారు. కానీ లావణ్య ఆచూకీ లభించకపోయే సరికి పొలం వద్ద ఉన్న బావిలో గాలించగా లావణ్య మృతదేహం గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు. లావణ్య, పరమేష్ మృతదేహాలను వెలికి తీశారు. కానీ మౌనిక మృతదేహం లభించక పోవడంతో గజ ఈతగాళ్ళు మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో దిగువ బురుజుపల్లెలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై గుర్రంకొండ ఎస్ఐ దినేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.