Annamayya News : గృహప్రవేశ కార్యక్రమంలో అపశృతి, టెంట్ కరెంట్ తీగలకు తగిలి ముగ్గురు మృతి
Annamayya News : అన్నమయ్య జిల్లాలో పెద్దతిప్ప సముద్రం మండలంలో విషాదం నెలకొంది. గృహప్రవేశంలో అపశృతి చోటుచేసుకుని ముగ్గురు మృతిచెందారు.
Annamayya News : అన్నమయ్య జిల్లాలో పెద్దతిప్ప సముద్రం మండలం కానుగమాకులపల్లెలో విషాదం నెలకొంది. గృహప్రవేశం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గృహ ప్రవేశం కార్యక్రమం కోసం వేసిన టెంట్ గాలికి ఎగిరివెళ్లి విద్యుత్ తీగలపై పడి... కరెంట్ ప్రవహించడంతో ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మమ్మ(70), విజయ్ ప్రశాంత్(25), లక్ష్మణ(53) ముగ్గురు మృతి చెందారు. సుబ్బమ్మ(75), సునీత(40), సుధాకర్(48) తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న ఆర్డీవో మురళి ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మదనపల్లె ఆసుపత్రి అధికారులకు ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారిని ఆర్డీవో మురళి పరామర్శించారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించారు. శుభకార్యంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వైశాఖి వేడుకల్లో విషాదం, 80 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో వైశాఖి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బెయిన్ గ్రామంలోని బేణి సంగమ్ వద్ద ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులూ ఉన్నారు. పోలీసులతో పాటు మరి కొన్ని టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించాయి. ఒకేసారి భారీ మొత్తంలో భక్తులు బ్రిడ్జ్‌పైకి రావడం వల్ల కుప్ప కూలినట్టు పోలీసులు వెల్లడించారు.
"ఈ ప్రమాదంలో కనీసం 80 మంది గాయపడ్డారు. వీరిలో 20-25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఆరేడుగురిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించాం. మరి కొంత మందికి ఇక్కడే చికిత్స అందిస్తున్నాం. మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంది" - అధికారులు