Andhra Pradesh: యూట్యూబ్‌లో చూసి ఎలాంటి బైక్ నైనా చోరీ చేస్తారు... ఇలా ఆ ముఠా చోరీ చేసిన బైక్‌లెన్నో తెలిస్తే షాక్ అవుతారు..
దొంగలు రూటుమార్చారు….వాళ్లు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని తమ వృత్తిలో దూసుకుపోతున్నారు. ఇలా టెక్నాలజీ సాయంతో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలముఠాని చిత్తూరు పోలీసలు అరెస్ట్ చేశారు.
యూట్యూబ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారీగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన 13 మంది అంతర్ రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి 107 బైక్‌లు, ఓ ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నాకు. అదే తరహాలో చోరీలకు పాల్పడిన మరో ఇద్దరి అరెస్ట్ చేసి 109 బైక్‌లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు జిల్లాల్లో ఒకేరోజు 216 బైక్‌లు పట్టుబడ్డాయి. రెండుచోట్లా పట్టుబడిన నిందితులు అంతర్ రాష్ట్ర దొంగలు కావటం.. టెక్నాలజీ సాయంతోనే చోరీలకు పాల్పడటం విశేషం.
చిత్తూరు, పలమనేరు, పుత్తూరు, శ్రీసిటీ సబ్–డివిజన్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నట్టు పోలీసులకు పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన డీఎస్పీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆ బృందాలు చిత్తూరు జిల్లాతోపాటు తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు జిల్లాకు చెందిన నాలుగు ముఠాలు వాహనాల చోరీకి పాల్పడుతున్నట్టు గుర్తించాయి. వరుస చోరీలకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి విచారణ జరపగా.. జల్సాలకు అలవాటు పడి ఆ దొంగల్లో పలువురు యూట్యూబ్‌లో చూసి చోరీలు చేస్తున్నట్టు చెప్పారు. చిత్తూరు సబ్ డివిజన్‌లో ముగ్గురిని అరెస్ట్ చేసి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడు పేర్నంబట్టుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి 27 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీ పరిధిలో మరొకరిని అరెస్టే చేసి 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.
ఏపీలోనూ బైక్ దొంగలు
తెలంగాణతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటార్ బైక్‌లు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.55 లక్షల విలువైన 109 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పత్సా రాంబాబు, మారం మునియ్య తాళాలు వేసి ఉన్న ఎలాంటి బైక్‌నైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సులభంగా స్టార్ట్ చేసి దర్జాగా వేసుకెళ్లిపోయేవారు. దొంగిలించిన 109 బైక్‌లలో 83 బైక్‌లకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 26 బైక్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. చోరీ చేసిన బైక్ లను యాదవోలుకు చెందిన 12 మంది వ్యక్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నిందితులు 93 బైక్‌లను యాదవోలు గ్రామంలోనే విక్రయించినట్టు చెప్పారు. నిందితులు పత్సా రాంబాబు, మారం మునియ్య పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులిద్దరితోపాటు బైక్‌లు కొనుగోలు చేసిన 12 మందిపైనా కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు.