Anakapalli News : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం, సీతాపాలెం బీచ్ లో 7గురు విద్యార్థులు గల్లంతు
Anakapalli News : అనకాపల్లి జిల్లా సీతాపాలెం బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం అయింది.
Anakapalli News : అనకాపల్లి జిల్లా సీతాపాలెం సముద్ర తీరంలో విషాద ఘటన జరిగింది. ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. అనకాపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది. గుడివాడ పవన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యం అయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో విద్యార్థిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మరో ఐదురుగు విద్యార్థులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 12 మంది విద్యార్థులు పూడి మడక సీతాపాలెం తీరానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సీతాపాలెం బీచ్‌లో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. వీరిలో నర్సీపట్నానికి చెందిన పవన్(19) మృతి చెందాడు. ప్రాణాపాయంలో ఉన్న సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని మత్స్యకారులు రక్షించారు. ఈ ప్రమాదంలో గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకు చెందిన సతీశ్, చూచుకొండకు చెందిన గణేశ్, యలమంచిలికి చెందిన చందూ సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన మరో ఐదుగురి కోసం పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరా
అనకాపల్లి డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు శుక్రవారం సీతాపాలెం బీచ్ కు వచ్చారు. కాలేజీలో పరీక్షలు ముగియడంతో విద్యార్థులు బీచ్ కు వచ్చారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు స్నానానికి బీచ్ లో దిగారు. మిగిలిన విద్యార్థులు ఒడ్డునే కూర్చుని చూస్తున్నారు. ఒక్కసారిగా భారీగా అలలు రావడంతో ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ప్రమాదాన్ని గమనించిన ఒడ్డున్నున విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు ఒక విద్యార్థిని రక్షించారు. కానీ అప్పటికే అతడు నీళ్లు తాగడంతో చికిత్సకోసం అనకాపల్లి ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీతాపాలెం ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరా తీశారు. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. సహాయక చర్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు.