Ganja Seized : కోటిన్నర విలువైన గంజాయితో బోర్డర్ దాటేద్దాం అనుకున్నారు, షాకిచ్చిన పోలీసులు!
Ganja Seized : లారీలో తరలిస్తున్న 530 కేజీల గంజాయిని చింతూరు పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు కోటిన్నర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Ganja Seized : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 530 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతూరు మండలం సుకుమామిడి గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్ లోని అలిగఢ్ కి గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి, సుమారు రూ. కోటి ఆరు లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి కేసు పాత నేరస్థుడు అరెస్టు
గంజాయి విక్రయాలకు పాల్పడిన పాత నేరస్థుడు బబుల్ శర్మను శ్రీకాకుళం కాశిబుగ్గ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ కేసు వివరాలు తెలిపారు. గత ఏడాదిలో పలాస మండలం సున్నాదేవి గ్రామం వద్ద 40 కిలోల గంజాయిని కాశిబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు పశ్చిమ బెంగాల్ 24 పరగణాల తాలూకా ఉల్లంఘ్య గ్రామానికి చెందిన బబుల్స్ శర్మగా గుర్తించారు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బబుల్ శర్మ వియోగిస్తున్న ఫోన్ కాల్ డేటా ఆధారంగా కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అక్కుపల్లి రోడ్డులో శనివారం సీఐ శంకర్ రావు తన బృందంతో సోదాలు చేస్తుండగా అనుమానాస్పదం వస్తున్న వాహనం తనిఖీ చేశారు. ఈ వాహనాన్ని పరిశీలించగా బబుల్ శర్మ అనే వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు. అతడు పాత కేసులో ముద్దాయిగా గుర్తించారు.
కారులో కత్తులు
ఈ వాహనాన్ని పరిశీలించగా రెండు కత్తులు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని డ్రైవరు శుభర్తో మున్నాను కూడా అరెస్టు చేశారు పోలీసులు. బబుల్ శర్మ పలాస రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో నాటు తుపాకీ కూడా ఉన్నట్లు ఈ ప్రాంతంలో ప్రచారం జరిగింది. కానీ దీన్ని పోలీసులు నిర్ధారించలేదు. గతంలో కూడా ఈయనపై నేర చరిత్ర ఉన్నట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. 2004 సంవత్సరంలో సారవకోట వద్ద జంట హత్యల కేసులో ముద్దాయిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోందని అతనిపై గంజాయి రవాణా అక్రమంగా కత్తులు కలిగి ఉన్న నేరాలపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.