Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతుంది. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు.
Adilabad Cheddi Gang : అదిలాబాద్ జిల్లాలో చెడ్డీ దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని జైనథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్, బోథ్ మండలాలలో రెండు రోజుల నుంచి వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. దీపాయిగూడ, ఇచ్చోడలో సీసీ టీవీ పూటేజ్ లో చెడ్డీ దొంగలు కనిపించారు. చెడ్డీ గ్యాంగ్ గా జిల్లాలో వరుస చోరీ చేస్తుందని వదంతలు వినిపిస్తున్నాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చోరీలకు పాల్పడిన చోట్ల క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టారు. దొంగల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రాత్రిపూట కర్రలతో జాగారం చేస్తు గస్తీ కాస్తున్నారు.
జిల్లాలో దొంగల బీభత్సం
ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లు కనిపిస్తే అంతే.. తాళాలు పగలగొట్టి ఇళ్లు గుల్ల చేస్తున్నారు. దొరికిన కాడికి దోచేస్తున్నారు. రెండు రోజుల క్రితం జైనథ్ మండలం దీపాయిగూడలో చోరీలకు పాల్పడ్డారు. అక్కడ దొంగలు సంచరించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు సీసీటీవీ పూటేజ్ ను గమనించి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంటిలో చోరీ చేసి నగలు, బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన జరిగిన అనంతరం ఇచ్చోడ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని విద్యానగర్, సాయినగర్ కాలనీల్లో చోరికి యత్నించారు. రెండు ఇళ్ల డోర్ లకు డ్రిల్ చేసి ఇళ్లలో చొరబడే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు మేల్కోవడంతో దొంగలు చాకచక్యంగా పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీమ్ ను రంగంలోకి దించారు. అన్ని విధాలుగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
రాత్రిపూట గ్రామాల్లో ప్రజలు గస్తీ
బోథ్ మండలం కనుగుట్ట సమీపంలోని పత్తి చేనుల్లోకి దొంగలు చోరబడ్డారు. పత్తి ఏరుతున్న మహిళలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కనిపించగా.. మహిళలు అరుపులు కేకలు వేయడంతో వాళ్లు పరారయ్యారు. దీంతో అక్కడకి చేరుకున్న స్థానికులు దుండగుల కోసం గాలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా చెడ్డీగ్యాంగ్ అని వదంతులు వినిపిస్తున్నాయి. దొంగల సంచారం భయాందోళనకు గురిచేస్తుండటంతో ప్రజలు రాత్రిపూట కర్రలు పట్టుకుని జాగారం చేస్తున్నారు. జిల్లాలో దొంగలు సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పలు చోట్ల డప్పు చాటింపు చేయడంతో పాటు వాహనాల్లో మైక్ సెట్ ద్వారా అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులలో మూడు ఘటనలు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు, దొంగల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
చెడ్డీ గ్యాంగ్ గా వదంతులు
రెండు రోజులుగా జైనథ్, బోథ్, మండలాలలో బీభత్సం సృష్టించిన దొంగల ముఠా.. ఇచ్చోడలోనూ రాత్రిపూట దొంగతనానికి యత్నించింది. జైనథ్, బోథ్ మండలాలలో సీసీ కెమెరాల్లో రికార్డైనా దృశ్యాల్లో ఉన్న దొంగల ముఠా చెడ్డీ గ్యాంగ్ గా వదంతులు వినిపిస్తున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఇచ్చోడతో పాటు జిల్లాలో పలుచోట్ల జరిగిన దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దొంగల కోసం ప్రత్యేక పోలీస్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు.