Hyderabad News: మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు - ఏడేళ్ల చిన్నారి మృతి, తండ్రికి గాయాలు
Road Accident: ఓ యువకుడి నిర్లక్ష్యం చిన్నారి నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు బైక్‌ను ఢీకొనగా ఏడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
Child Died In a Accident In Hyderabad: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోల్కొండ పరిధిలో ఈ ప్రమాదం శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గోల్కొండ పరిధి ఇబ్రహీంబాగ్‌లో ఓ కారు బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి రమేశ్, తన కుమారుడు శౌర్య (7)తో కలిసి ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో షేక్ పేట మారుతీనగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అనే యువకుడు వీరి బైక్‌ను ఢీకొట్టాడు. యువకుడు మద్యం మత్తులో కారు నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రమేశ్‌కు స్వల్ప గాయాలు కాగా.. చిన్నారి శౌర్యకు తీవ్ర గాయాలయ్యాయి.
చిన్నారి మృతి
స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో బీటెక్ విద్యార్థి
బీటెక్ పూర్తి చేసి గ్రాడ్యూయేట్ పట్టా అందుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన సాయికుమార్ (26), అతని స్నేహితులు వినోద్, విజయ్‌లు కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. శుక్రవారం కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా.. డిగ్రీ పట్టాలు తీసుకునేందుకు సాయికుమార్ అతని స్నేహితులతో కలిసి బైక్‌పై సంగారెడ్డి నుంచి కళాశాలకు బయలుదేరాడు. గౌడవెళ్లి సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో దుండిగల్ వైపు నుంచి సీఎంఆర్ కళాశాల వైపు వస్తుండగా అండర్ పాస్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో ఓ లారీని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో సాయికుమార్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. వినోద్, విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.