Amalapuram Psycho : అమలాపురంలో సైకో వీరంగం - మహిళ పీక కోసి హత్య !
అమలాపురంలో ఓ సైకో మహిళలను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దాడికి గురైన ఓ మహిళ చనిపోయింది.
Amalapuram Psycho : ఏపీలో నేర ప్రవృత్తి ఉన్న దండగులు రెచ్చిపోతున్నారు. వరుసగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అమలాపురంలో ఓ సైకో ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేశారు. కారణం లేకుండా కనీస పరిచయం కూడా లేని మహిళల్ని హత్య చేయడానికి ప్రయత్నించడం కలకలంరేపుతోంది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఏఎంజీ కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మహిళలు ఇంటి బయట పని చేసుకుటున్న సమయంలో ఓ సైకో విరుచుకుపడ్డారు. వెనుక నుంచి వచ్చి తల పట్టుకుని పీక కోశాడు. ఇలా ఓ మహిళపై దాడి చేసి పీక కోయడంతో ఆమె చనిపోయింది. మరో మహిళనూ అలాగే హత్య చేయడానికి ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దాంతో సైకో కత్తితో ఇష్టమొచ్చనట్లుగా గాయలు చేశాడు. అక్కడే ఉన్నన ఇంటి యజమాని పైకూడా దాడి చేశారు.
మృతి చెందిన మహిళ పేరు మన్నె శ్రీదేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె వయసు ఇరవై ఎనిమిదేళ్లు. గాయపడిన మరో మహిళను వెంకటరమణగా గుర్తించారు. అసలు ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించని ఆ మహిళలు ఇంటి ముందు తమ పని తాము చేసుకుంటూండగా.. వెనుక నుంచి వచ్చి చాకుతో శ్రీదేవి పీక కోయడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. తీవ్ర గాయాలతో మరో మహిళ వెంకటరమణ అమలపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
దాడి చేసిన సైకోను సాహసం చేసి వెంటనే స్థానికులు పట్టుకున్నారు. చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైకో అతని వద్దనున్న కార్డుల ఆధారంగా నెల్లూరు వాసిగా గుర్తించారు. దాడిచేసిన సైకో పూర్తిగా మతి స్తిమితం లేదని చెబుతున్నారు. పట్టుకునే సమయంలో కూడా స్థానికులపై దాడికి తెగబడటంతో దేహశుద్ధి చేశారు. అతన్ని పోలీసులకు అప్పగించారు.
మానసిక సమస్యలతో సైకోలుగా మారుతున్న వారు గంజాయికి.. ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ప్రజలపై దాడి చేస్తున్నారు. ఏపీలో ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీసులు ఇలాంటి సైకోలపై దృష్టి పెట్టకపోవడంతో... నేరాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తూ .. తమకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని.. తమను అవమానంచారని.. తమను టార్గెట్ గా పెట్టుకుని ఇలా రకరకాలుగా మానసిక భావనలకు లోనై.., అసలు ముక్కూ ముఖం తెలియని వాళ్లపై దాడులు సైకోలు చేస్తున్నారు. పీకలు కోసి చంపడం అంటే.. అత్యంత భయంకరం. వరుసగా దొరికిన వారందర్నీ అలా చంపడానికి అమలాపురం సైకో ప్రయత్నించాడు.