Crime News: చిత్తూరు జిల్లాలో అమానుషం - ఏడాదిన్నర చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు
Chittor News: చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి ఏడాదిన్నర చిన్నారిని నేలకేసి కొట్టి దారుణంగా హతమార్చాడు. సహజీవనం పేరుతో మహిళకు దగ్గరైన వ్యక్తి ఆమె బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదైంది.
One And Half Year Old Baby Killed Brutally In Chittor District: చిత్తూరు (Chittor) జిల్లాలో శనివారం అమానుష ఘటన జరిగింది. సహజీవనం పేరుతో ఓ మహిళకు దగ్గరైన ఓ వ్యక్తి ఆమె పిల్లలను భారంగా భావించాడు. మద్యం మత్తులో ఏడాదిన్నర చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఇంటి పైనుంచి పడిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయగా.. మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తవణంపల్లె మండలం మాధవరం సమీపంలోని కృష్ణాపురానికి చెందిన శిరీషకు, ఐరాల మండలం జంగాలపల్లెకి చెందిన చంద్రప్రకాష్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. శిరీషకు మతిస్థిమితం సరిగ్గా లేదని, ఆమెపై అనుమానంతో చంద్రప్రకాష్ ఆమెను దూరం పెట్టాడు. కొంతకాలంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు.
వేరే వ్యక్తితో సహజీవనం
భర్తకు దూరంగా ఉంటున్న శిరీషకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి దిగుమాసాపల్లెలోని ఓ కోళ్లఫారంలో పనికి కుదిరారు. అయితే, ప్రదీప్ ఆ ముగ్గురు పిల్లలను పోషించడం కష్టమని భారంగా భావించాడు. శనివారం మద్యం సేవించి.. మత్తులో ఏడాదిన్నర వయసున్న దినేష్ అనే చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు. అయితే, పిల్లాడు ఇంటిపై నుంచి పడిపోయాడని.. కొన ఊపిరితో ఉన్నాడని శిరీషను నమ్మించాడు. ఇద్దరు కలిసి చిన్నారిని చిత్తూరు ఆస్పత్రికి తరలించారు.
బంధువుల అనుమానంతో..
ఈ విషయాన్ని శిరీష తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అనుమానంతో వీడియో కాల్‌లో పిల్లాడిని చూపించాలని పట్టుబట్టారు. బాలుడి ముక్కు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడాన్ని గుర్తించారు. అంతేకాకుండా ప్రదీప్ మాటతీరు, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో శిరీష సోదరుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read: Kappatralla Murder Case: కప్పట్రాళ్ల హత్య కేసు - వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు