Fater Daughter : ఫోన్ మాట్లాడితే మేడపై నుంచి తోసేస్తారా? పల్నాడు జిల్లాలో ఓ తండ్రి ఘాతుకం !
ఫోన్ మాట్లాడుతోందని కుమార్తెను మేడపై నుంచి తోసేశాడు ఓ తండ్రి. పల్నాడు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Fater Daughter : కూతురు అదే పనిగా ఫోన్ మాట్లాడుతోందని.. ఆమెను మేడ పై నుంచి తోసేశాడు ఓ తండ్రి. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో చోటుచేసుకుంది. కూతురు ఫోన్ మాట్లాడుతుందన్న ఆగ్రహంతో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో కూరాకుల ప్రసాద్ అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేసుకుని కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. ఇటీవల కుమార్తె ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుతోంది. కూరాకుల ప్రసాద్ చాలా సార్లు కుమార్తెను మందలించారు. అయినప్పటికీ కుమార్తె పలుమార్లు ఫోన్ మాట్లాడుతూ తండ్రి కంటికి కనిపించింది. ఇలా ఈ రోజు కూడా మేడపైకి వెళ్లి రహస్యంగా ఫోన్ మాట్లాడుతూడటంతో చూసిన కూరాకుల ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. కుమార్తెపై చేయి చేసుకోవడంతో పాటు నెట్టేశాడు. దీంతో ఆమె మేడపై నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలయ్యాయి.
ఫోన్ మాట్లాడితే కన్నతండ్రి కోపగించుకుంటాడని తెలుసు కానీ ఇలా ప్రాణాలకు తీసేంత కోపం తెచ్చుకుంటాడని ఆ కుమార్తె ఊహించలేకపోయింది. ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాడని అనుకుంది కానీ.. ఫోన్ మాట్లాడితేనే చంపేస్తారని అనుకోలేదు. అందుకే ... తండ్రి ఎన్ని సార్లు తిట్టినా... అదంతా తనపై ప్రేమతోనే అనుకుంది.కానీ... ఆ ప్రేమ కాస్తా.. చంపేంత కోపానికి దారి తీస్తుందని ఊహించలేకపోయింది.
కుమార్తె ఒక్క సారిగా డాబా పై నుంచి పడిపోవడంతో ఇంట్లో ఉన్న తల్లికి కూడా మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆస్పత్రికి తరలించిన తర్వాత విషమ పరిస్థితుల్లో ఉన్న కుమార్తె.. తన తండ్రే తనను మేడపై నుంచి నెట్టేశాడని తల్లికి తెలిపింది. దీంతో ఆ తల్లి ... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూరాకుల వరప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
తన కుమార్తె రహస్యంగా ఎవరితోనే మాట్లాడుతోందని.. దారి తప్పుతోందన్న అనుమానంతో ఇలా కుమార్తెను మేడపై నుంచి తోసేసేంత కోపం తెచ్చుకున్నారని భావిస్తున్నారు. కూరాకుల వర ప్రసాద్ భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వర ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.