Zomato: ఆర్డర్ చేసేవాళ్లు లేక 225 పట్టణాల్లో జొమాటో సర్వీసులు బంద్
మొత్తం వ్యయాలు కూడా రూ. 1,642 కోట్ల నుంచి రూ. 2,485 కోట్లకు పెరగడం వల్ల నష్టాలు తప్పలేదు.
Zomato: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 225 చిన్న పట్టణాలు/ నగరాల్లో సేవలు నిలిపేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (డిసెంబర్ త్రైమాసికం) కంపెనీ నష్టాలు భారీగా పెరిగాయి. ఆ త్రైమాసికంలో, ఆహార పంపిణీ వ్యాపారంలో రూ. 346.6 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2021లోని ఇదే కాలంలో సంస్థ నష్టం కేవలం రూ. 67 కోట్లుగా ఉంది.
ఆన్‌లైన్ ఫుడ్ వ్యాపారంలో వేగం తగ్గడం, కంపెనీ ప్రకటనలు & ఇతర వ్యయాలు పెరగడం, బ్లింకిట్ నుంచి పెరిగిన నష్టాలు కలగలిసి మొత్తం నష్టాలను భారీగా పెంచాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ. 1,112 కోట్ల నుంచి రూ. 1,948 కోట్లకు పెరిగినా.. మొత్తం వ్యయాలు కూడా రూ. 1,642 కోట్ల నుంచి రూ. 2,485 కోట్లకు పెరగడం వల్ల భారీ నష్టాలు తప్పలేదు.
ఫుడ్ డెలివెరీ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీలకు వ్యాపారం తగ్గిందని జొమాటో సీఎఫ్‌వో అక్షత్ గోయల్ తెలిపారు. గతేడాది అక్టోబర్ తర్వాతి (దీపావళి తర్వాత) నుంచి వేగం మందగించిందని వివరించారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా, టాప్-8 నగరాల్లో బిజినెస్ చాలా ఎక్కువగా తగ్గిందని వెల్లడించారు.
కనీసం ఖర్చులు కూడా రావడం లేదట!
ఈ నష్టాల నుంచి తప్పించుకోవడానికి 225 పట్టణాలు లేదా చిన్న నగరాల్లో ఫుడ్ డెలివెరీ సేవలను జొమాటో ఆపేసింది. ఆయా ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు జనవరిలో నిలిపివేసినట్లు, డిసెంబర్ ఆర్థిక ఫలితాల సందర్భంగా అక్షత్ గోయల్ చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ 225 పట్టణాలు/ చిన్న నగరాల నుంచి వచ్చిన ఆదాయం, జొమాటో మొత్తం ఆదాయంలో కేవలం 0.3 శాతమే అన్నారు. ఆ పట్టణాల్లో సేవల వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావడం లేదు కాబట్టే కార్యకలాపాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే, ఏయే ప్రాంతాల్లో సేవలు నిలిపేసిందన్న విషయాన్ని జొమాటో వెల్లడించలేదు.
ఓవరాల్‌గా చూస్తే, దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ వృద్ధి అవకాశాల పరంగా ఇప్పటికీ ఎంతో ఆశావహంగా, ఉత్సాహంగా ఉన్నట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు.
భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్స్‌లో Zomato ఒకటి. లాభాలను పెంచుకునే ప్రయత్నంగా ఇటీవలే గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను పునఃప్రారంభించింది. ఈ స్కీమ్‌లో 9 లక్షల మందికి పైగా సభ్యులు చేరారని, డిసెంబర్ ఫలితాల సమయంలో కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం, దాదాపు 800 మందిని కొత్తగా నియమించుకునే ప్రయత్నాల్లో జొమాటో ఉంది. ఈ సమయంలో 225 పట్టణాలు, చిన్న నగరాల నుంచి బయటకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది.
ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి జొమాటో షేర్ 2.81% నష్టంతో రూ. 51.80 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.