Zerodha: అంతా నా 'కర్మ', అప్పుడు చేసిన పనులు ఇప్పుడు వెంటాడుతున్నాయి - జీరోధ సీఈవో సంచలన కామెంట్స్
Nithin Kamath Comments: 'అంతిమంగా, మీ చర్యల ఫలాలు మీకు తిరిగి వస్తాయి. ఇప్పుడు నేను నా ఫోన్‌ని సైలెంట్‌లో ఉంచడానికి ఇదే కారణం' అని కామత్ వ్యాఖ్యానించారు.
Nithin Kamath Comments: ఎవరికైనా ఇబ్బంది/ కష్టం ఎదురైతే.. అంతా అతని కర్మ అంటారు. కర్మ ఫలితం/ కర్మ ఫలం అనుభవించాల్సిందే అంటూ తత్వం బోధిస్తారు. ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ జీరోధ ఫౌండర్, సీఈవో నితిన్ కామత్ (Zerodha CEO Nithin Kamath) కూడా సరిగ్గా ఇదే మాటలు చెప్పారు. గతంలో తాను చేసిన కర్మలు ఇప్పుడు తనను వెంటాడుతున్నాయని చెబుతూ, తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. నితిన్ కామత్ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్స్‌గా మారాయి.
ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కామత్
తన పాత ఉద్యోగం రోజులను గుర్తు చేసుకున్న కామత్, ఈ వ్యాఖ్యాలు రాశారు. నితిన్ కామత్, తన 17 సంవత్సరాల వయస్సులో అమెరికాలోని ఓ కాల్ సెంటర్‌లో పని చేశారు. అదే సమయంలో స్టాక్ ట్రేడింగ్ కూడా ప్రారంభించారు. కాల్ సెంటర్ ఉద్యోగం ద్వారా స్టాక్ ట్రేడింగ్ కోసం డబ్బు సమకూర్చుకునేవారు. అంతేకాదు, రోజుకు రూ. 200 జీతానికి ఓ స్టాల్‌లో నిలబడే పని కూడా చేశారట.
అమెరికాలోని టెలీమార్కెటింగ్ కంపెనీలో కామత్ 4 సంవత్సరాల పాటు పని చేశారట. ఉద్యోగంలో భాగంగా, కాల్ సెంటర్‌లో కూర్చుని అమెరికాలోని చాలామందికి అనవసర కాల్స్ చేశానని కామత్ వెల్లడించారు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు తనను వెంటాడుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు, తన ఫోన్ నిరంతరం సైలెంట్‌లోనే ఉంటోందని, నిరుపయోగంగా మారిందని రాశారు. 'అంతిమంగా, మీ చర్యల ఫలాలు మీకు తిరిగి వస్తాయి. ఇప్పుడు నేను నా ఫోన్‌ని సైలెంట్‌లో ఉంచడానికి ఇదే కారణం' అని కామత్ వ్యాఖ్యానించారు. అయితే, కామత్ సరదాగానే ఈ కామెంట్స్ చేశారు.
కాల్ సెంటర్‌లో పని చేసినప్పటి కొన్ని ఫొటోలను కూడా నితిన్ కామత్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
My phone has become unusable due to telemarketing and is always silent. Guess what goes around comes around.
— Nithin Kamath (@Nithin0dha) May 4, 2024
I spent four years at a call center, making unsolicited calls to people in the US. I guess Karma has a way of biting back. 😬 pic.twitter.com/HkPetLYpQI
అమెరికాలో కాల్ సెంటర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత, నితిన్ కామత్ & నిఖిల్ కామత్ కలిసి, కామత్ అసోసియేట్స్ పేరిట ఓ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత, ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జీరోధను 2010లో ప్రారంభించారు.
టెలిమార్కెటింగ్ కాల్స్ నిరోధానికి కమిటీ ఏర్పాటు
ఓ సర్వే ప్రకారం, ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురికి రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ టెలీమార్కెటింగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్‌లో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు (బ్యాంక్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ వంటివి), స్థిరాస్తి రంగానికి సంబంధించినవి. ఇలాంటి అనవసర కాల్స్‌ను నిరోధించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
మరో ఆసక్తికర కథనం: ఇలాంటి జాబ్ అప్లికేషన్ ఎక్కడా చూసుండరు, ఉద్యోగం ఇస్తే డబ్బులు ఎదురిస్తాడట