Jio Soundbox: ఫోన్‌పే, పేటీఎం బాక్స్‌లు బద్దలయ్యే పోటీ - సౌండ్‌బాక్స్ బరిలోకి జియో
ఇప్పటికే ఆ రంగం/విభాగంలో పాతుకుపోయిన కంపెనీల పునాదులు కదిలేలా రిలయన్స్ దూసుకొస్తుంది. సౌండ్ బాక్స్ విభాగంలోనూ అదే తరహా ఎంట్రీని మార్కెట్ ఆశిస్తోంది.
Jio Payments Entry Into Soundbox Segment: పేమెంట్స్ సౌండ్ బాక్స్ విభాగంలో రాజ్యమేలుతున్న ఫోన్‌పే (PhonePe), పేటీఎంకు (Paytm) చుక్కలు చూపించడానికి 'జియో పేమెంట్స్' రంగంలోకి దిగుతోంది. సౌండ్ బాక్స్ సెగ్మెంట్‌లో రాజ్యమేలుతున్న 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్' (PPBL) సంక్షోభాన్ని తనకు అవకాశంగా మార్చుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల (Digital payments) విభాగంలోకి స్మార్ట్ స్పీకర్‌తో రానున్నట్లు గూగుల్‌పే (Google Pay) కూడా ఇప్పటికే ప్రకటించింది. భారత్‌పే (BharatPe) కూడా ఈ సెగ్మెంట్‌లో పని చేస్తోంది.
డిపాజిట్లు, క్రెడిట్ సంబంధిత కార్యకలాపాలు ఆపేయడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన గడువు మార్చి 15తో ముగుస్తుంది. లావాదేవీలు ఆగిపోకుండా చూసేందుకు వేరే బ్యాంక్‌లతో జట్టు కట్టడానికి PPBL తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది, ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. ఇప్పటికే యూపీఐ మార్కెట్‌లో పేటీఎం వాటా తగ్గింది. ఇప్పుడు, జియో పేమెంట్స్ నుంచి స్మార్ట్ స్పీకర్ రానుండడం పేటీఎంకు మరో గట్టి ఎదురుదెబ్బ.
పేటీఎం, ఫోన్‌పేతో పాటు గూగుల్ పేకు కూడా గుబులు
మార్కెట్ విలువ పరంగా, దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries - RIL). ముఖేష్ అంబానీ నేతృత్వంలో పని చేసే రిలయన్స్, ఏ రంగం/విభాగంలోకి అడుగు పెట్టినా సౌండ్ గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే ఆ రంగం/విభాగంలో పాతుకుపోయిన కంపెనీల పునాదులు కదిలేలా రిలయన్స్ దూసుకొస్తుంది. సౌండ్ బాక్స్ విభాగంలోనూ అదే తరహా ఎంట్రీని మార్కెట్ ఆశిస్తుంది.
భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫీల్డ్ డిజిటల్ చెల్లింపులు. రిలయన్స్ జియోకు చెందిన పేమెంట్స్ సౌండ్‌బాక్స్ ఈ ఫీల్డ్‌లోకి ప్రవేశిస్తే.. పేటీఎం, ఫోన్‌పేతో పాటు గూగుల్ పేకు కూడా గుబులు పుట్టిస్తుంది, గట్టి పోటీని సృష్టిస్తుంది.
రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ అంటే ఏమిటి? (What Is Reliance Jio Payments Soundbox?)
జియో పేమెంట్స్ ఇప్పటికే జియో పే (Jio Pay) పేరిట ఒక యాప్ ఉంది. ఇప్పుడు వేస్తున్న కొత్త అడుగు వల్ల, సౌండ్‌బాక్స్ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ వ్యాపార పరిధి ఇంకా పెరిగే అవకాశం ఉంది. జియో సౌండ్‌బాక్స్ ట్రయల్ దశ ఇప్పటికే ప్రారంభమైంది. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, షాప్ ఓనర్లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించాలని జియో ఆలోచిస్తోంది. దీనివల్ల, జియో సౌండ్‌బాక్స్ వినియోగం పెరిగి, UPI మార్కెట్‌లో వాటా బలపడుతుంది.
హిందు బిజినెస్ లైన్ రిపోర్ట్ ప్రకారం... ఇండోర్, జైపుర్, లక్నో వంటి టైర్-2 నగరాల్లో ఉన్న రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఇప్పటికే ఈ పరికరాన్ని పరీక్షించారు. ఈ టెస్ట్‌లో జియో సౌండ్ బాక్స్ పాసయితే, ఆ తర్వాతి దశలో పట్టణ ప్రాంత మార్కెట్లలోకి ప్రవేశిస్తుంది. రాబోయే 8 నుంచి 9 నెలల్లో, అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్లలో జియో సౌండ్‌బాక్స్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఈ రెండు పైలట్ ప్రాజెక్ట్‌లు విజయవంతమైన తర్వాత, జియో సౌండ్ బాక్స్‌ను అన్ని రిటైల్ స్టోర్లలో లాంచ్ చేస్తారు.
వ్యూహాత్మక అడుగు
అవకాశం వచ్చినప్పుడే అందుకోవాలి, లేకపోతే చేజారిపోతుంది. పేటీఎం మీద ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సౌండ్‌బాక్స్ సెగ్మెంట్‌లోకి జియో పేమెంట్స్ ప్రవేశం దీనికి సరైన ఉదాహరణ. డిజిటల్ పేమెంట్స్ సెగ్మెంట్‌లో సరైన ప్లాన్‌తో, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ జియో పేమెంట్స్ చొచ్చుకుపోతోంది. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని, క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది.
ప్రస్తుతం, తన సౌండ్‌బాక్స్‌ను కేవలం ఒక్క రూపాయికే పేటీఎం అందిస్తోంది. నెలవారీ ఛార్జీ రూ.125 వసూలు చేస్తోంది. ఫోన్‌పే నెలకు రూ.49 అద్దె వసూలు చేస్తోంది. భారత్‌పే కూడా సౌండ్‌బాక్స్ విభాగంలోకి ప్రవేశించినా, ఎంత వసూలు చేస్తోందన్నదానిపై స్పష్టత లేదు.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జియో సౌండ్‌బాక్స్ నెలవారీ అద్దె చాలా తక్కువగా ఉండొచ్చు. దీనివల్ల పేటీఎం, ఫోన్‌పే వంటి కంపెనీలకు కఠినమైన పోటీని ఇస్తుంది, UPI మార్కెట్ ప్లేస్‌ను షేక్ చేయగలదు.
మరో ఆసక్తికర కథనం: ఆధార్ హోల్డర్లకు మళ్లీ గుడ్ న్యూస్, మరో 3 నెలల సమయం