New Income Tax Bill: కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లు అవసరమేంటి, ఎలాంటి మార్పులు చూడొచ్చు?
New Income Tax Bill Changes: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకురానున్నారు. దీని ద్వారా, ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టాన్ని రద్దు అవుతుందని చెబుతున్నారు.

Changes In New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం (07 ఫిబ్రవరి 2025) ఆమోదం తెలిపిందని పీటీఐ ప్రచురించింది. వాస్తవానికి, ఫిబ్రవరి 01న, కేంద్ర బడ్జెట్ 2025-26ను సమర్పిస్తున్న సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త ఆదాయ పన్ను బిల్లు గురించి మాట్లాడారు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి సర్కారు సన్నాహాలు చేసిందని ప్రకటించారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం, కేంద్ర కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదం లభించింది కాబట్టి, ప్రభుత్వం దానిని వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. అయితే, కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?, ఈ బిల్లులో కొత్తగా ఏం చేర్చారు? అనే విషయాలపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం రద్దు!
పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి, ఉభయ సభలు ఆమోదించడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961ను రద్దు చేస్తుంది. కొత్త ఆదాయ పన్ను చట్టం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్‌డేటెడ్‌గా ఉంటుంది. భారత పార్లమెంటు 1961 ఆదాయ పన్ను చట్టాన్ని ఆమోదించి & 01 ఏప్రిల్ 1962 నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుంచి, ఆ చట్టానికి అనేక సవరణలు జరిగాయి, కొత్త నిబంధనలు జోడించారు. ఈ కారణంగా ఈ చట్టం చాలా క్లిష్టంగా మారింది.
కొత్త అవసరాలకు అనుగుణంగా కొత్త బిల్లు
అధికార వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, పన్నుల వ్యవస్థను సరళంగా & పారదర్శకంగా మార్చడానికి ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లులో నిబంధనలు ఉన్నాయి. దీంతో, ఆదాయ పన్ను చట్టంలో ఉపయోగించే భాష గతంలో కంటే సరళంగా మారుతుంది, పన్నుల చెల్లింపు కూడా గతంలో కంటే సులభం అవుతుంది. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయ పన్ను చట్టం రూపుదిద్దుకుందని అధికార వర్గాలు తెలిపాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో, పన్ను చెల్లింపుదారులు చాలా పనులను స్వయంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఆదాయ పన్ను చెల్లింపుదారులు & రిటర్న్ దాఖలు చేసేవాళ్లు, పన్ను నిపుణుల కోసం ఈ బిల్లులో సరళమైన, సమగ్రమైన నిబంధనలు ఉన్నాయి, వాటిని అందరూ సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఆదాయ పన్ను కేసులను తగ్గించే ప్రయత్నాలు
పన్ను దాఖలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయవచ్చు. తద్వారా, భవిష్యత్తులో ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసేటప్పుడు (ITR Filing) పేపర్ వర్క్ అవసరం తగ్గుతుంది. ప్రజలు సులభంగా రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు. ఆదాయ పన్ను సంబంధిత కేసులను తగ్గించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం, వివిధ కేసుల్లో శిక్ష & జరిమానాను తగ్గించేలా కూడా నిబంధనలు ఉండవచ్చు.
పన్ను వ్యవస్థలోకి ఎక్కువ మంది
ఈ బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే, ఎక్కువ మంది పన్ను వ్యవస్థలో చేరాలి. అయితే, ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లులో కొత్త పన్ను వ్యవస్థ (New Income Tax Regime)కు ఎటువంటి ప్రొవిజన్ ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం, అంటే ఏప్రిల్ 01, 2025 నుండి దేశంలో ఈ కొత్త పన్ను విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికంటే ముందు, బిల్లును తదుపరి చర్చ కోసం స్టాండింగ్ కమిటీకి పంపవచ్చు.
మరో ఆసక్తికర కథనం: రైతులకు గుడ్‌న్యూస్, పీఎం కిసాన్ డబ్బులు త్వరలో విడుదల - ముందు ఈ పని చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

