Vishwakarma Scheme: గుడ్‌న్యూస్! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం
Vishwakarma Scheme: సెంట్రల్ కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది.
Vishwakarma Scheme:
సెంట్రల్ కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన సమావేశంలో రైల్వే, ఈ-బస్, విశ్వకర్మ పథకాలను ప్రకటించింది. రూ.32,500 కోట్లతో దేశవ్యాప్తంగా ఏడు రైల్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రూ.57,613 కోట్లతో పీఎం ఈ-బస్, రూ.13,000 కోట్లతో పీఎం విశ్వకర్మ పథకాలు అమలు చేయనున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వేర్వేరుగా వివరించారు.
ఏడు రైల్వే ప్రాజెక్టులు
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశమైంది. రూ32,500 కోట్లతో ఏడు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిని ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్‌ట్రక్షన్ (EPC) పద్ధతిలో చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా 2,339 కిలోమీటర్ల రైల్వే లైన్లు నిర్మిస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని 35 జిల్లాలో నెట్‌వర్క్ విస్తరిస్తుంది.
ఏటా 200 మిలియన్ టన్నుల మేర సరకు రవాణాను అదనంగా జత చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 'ప్రతి ప్రాజెక్టుకు మరో ప్రాజెక్టుతో సంబంధం ఉంటుంది. దేనినీ విడివిడిగా చూడొద్దు. ఈ ప్రాజెక్టుల వల్ల ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 7.6 కోట్ల పని దినాల పాఉ ఉపాధి దొరుకుతుంది' అని ఆయన వివరించారు.
విశ్వకర్మ పథకం
చేతి వృత్తులపై ఆధారపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆగస్టు 15న మోదీ ప్రకటన మేరకు.. చేనేత, బంగారం, ఇత్తడి, రజక, విశ్వ బ్రాహ్మణ సహా అనేక కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం రూ.13,000 కోట్లతో పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించింది. దీంతో 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. చేతి వృత్తుల వారికి మొదటి దశలో రూ. లక్ష, రెండో దశలో రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. నామమాత్రంగా 5 శాతం వడ్డీని వసూలు చేస్తారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిన ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ఆరంభిస్తారు.
ఈ-బస్ పథకం
కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ పథకాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం రూ.57,613 కోట్లను కేటాయించనుంది. కేంద్రం రూ.20,000 కోట్లు ఇస్తుంది. మిగతాది రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
'దేశవ్యాప్తంగా 10,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. 100 నగరాల్లో ఇవి తిరుగుతాయి. వీటిని ఛాలెంజింగ్ మెథడ్ ద్వారా ఎంపిక చేస్తాం. అయితే ఆ పట్టణాల్లో జనాభా 3 లక్షలకు పైగా ఉండాలి. పబ్లిక్ ప్రైవేటు పాట్నర్‌షిప్ పద్ధతిలో పథకాన్ని అమలు చేస్తాం. పదేళ్ల వరకు ఈ-బస్‌లకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. 45000-55000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది' అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్ మొబిలిటీలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, జేబీఎం ఆటో ఆధిపత్యం వహిస్తున్నాయి. అయితే ఈ పథకంలో భాగంగా ప్రభుత్వాలు లేదా నగరాలు బస్సులు నడిపించినందుకు బస్ ఆపరేటర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.
Also Read: మీది 30-40 వయసా! 60 కల్లా రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?