Indian Economy: భారతీయులకు శుభవార్త- వృద్ధిరేటు ప్రకటించిన ఐక్యరాజ్య సమితి
India GDP News: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైన వేళ భారత్ మాత్రం ముందుకు సాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది.
UN on Indian Economy: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలై మందగించిన వేళ భారత్ మాత్రం ముందుకు సాగుతోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారుల కన్ను స్థిరంగా కొనసాగుతున్న ఇండియన్ ఎకానమీ, ఈక్విటీలపై పడింది. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థకు 2024 కోసం ఐక్యరాజ్య సమితి తన వృద్ధి అంచనాలను సవరించింది. ఇది దేశీయ పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ ఏడాది 7 శాతం వరకు వృద్ధి
దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. ప్రధానంగా బలమైన ప్రభుత్వ పెట్టుబడులు, స్థితిస్థాపకమైన ప్రైవేట్ వినియోగం దీనిని నడిపిస్తాయని అంచనా వేసింది. 2024లో ఆర్థిక వ్యవస్థ 6.9 శాతంగా అంచనా వేయగా.. 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని ప్రస్తుతం వెల్లడించింది. దీనికి ముందు జనవరిలో ఐక్యరాజ్య సమితి జీడీపీ 6.2 శాతంగా ఉంటుందని తొలుత అంచనా వేసింది. అయితే సంవత్సరం మధ్యలోకి వచ్చేటప్పటికి మాత్రం వృద్ధిరేటును 6.9 శాతంగా ఉంటుందంటూ అంచనాలను సవరించింది.
ఇక యూఎస్ 2025లో భారతదేశ వృద్ధికి అంచనాలను గమనిస్తే.. తాజా అంచనాలో భారత జీడీపీ వృద్ధికి జనవరిలో అంచనా 6.6 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా కొనసాగించింది. భారతదేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 2023లో 5.6 శాతం నుంచి 2024లో 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ పరిమితి 2-6 శాతం మధ్యకాలిక లక్ష్య పరిధిలోనే ఉంటుంది. భారతదేశంలో బలమైన వృద్ధి, అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యం మధ్య లేబర్ మార్కెట్ సూచికలు కూడా మెరుగుపడ్డాయని పేర్కొంది.
2024లో గ్లోబల్ ట్రేడ్
ఇదే క్రమంలో దక్షిణాసియా ఆర్థిక దృక్పథం బలంగా ఉంటుందని అంచనా వేయబడింది. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఉండగా.. పాకిస్థాన్, శ్రీలంకలో స్వల్పంగా పుంజుకోవడం దీనికి మద్దతిస్తుందని. ప్రాంతీయ GDP 2024లో 5.8 శాతంగా, 2025లో 5.7 శాతంగా ఉంటాయని అంచనా వేయబడింది. అయితే ఇవి 2023లో నమోదైన 6.2 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. ఇదే క్రమంలో గ్లోబల్ ట్రేడ్ 2024లో కోలుకుంటుందని అంచనా వేయబడింది. దీని వెనుక చైనా విదేశీ వాణిజ్యం 2024లో మెుదటి రెండు నెలల కాలంలో ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందటం ఒక కారణంగా నిలిచింది.
ఇదే క్రమంలో ఇతర అంచనాలను పరిశీలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇదే క్రమంలో S&P గ్లోబల్ రేటింగ్స్, మోర్గాన్ స్టాన్లీ 6.8% వృద్ధిని అంచనా వేసాయి. అలాగే ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఫిచ్ రేటింగ్స్ కూడా 7% వృద్ధితో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగంగా దూసుకుపోతుందని అంచనా వేశాయి. ఇదిలా ఉండగా ఇటీవల దేశంలో ప్రభుత్వం విడుదల చేస్తున్న జీడీపీ గణాంకాలకు కోర్ సెక్టార్లలో వృద్ధికి మధ్య పొంతన ఉండటం లేదని ఏషియన్ పెయింట్స్ సీఈవో ఇన్వెస్టర్ల ప్రశ్నలకు బదులిస్తూ పేర్కొన్నారు. జీడీపీ విషయంలో అంకెల గారడీ జరుగుతోందని అన్నారు. దీనిపై ఎన్నికల వేళ కాంగ్రెస్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.