Income Tax: పదేళ్లలో ఆదాయ పన్ను ఇన్ని రకాలుగా మారిందా? - తెలిస్తే ఆశ్చర్యపోతారు
Union Budget 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీని తగ్గించడం ద్వారా తమ బాధను బయటపెట్టారు ప్రజలు. బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్న మొదటి పెద్ద ఉపశమనం 'ఆదాయ పన్ను మినహాయింపు'.
Tax Decisions During Last 10 Years: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో, గత 10 సంవత్సరాల్లో, ఆదాయ పన్నులు సహా వివిధ పన్నుల విధానాలను క్రమబద్ధీకరించడానికి, పన్నులు కట్టేలా ప్రజలను ప్రోత్సహించడానికి, పన్నుల విధానంలో పారదర్శకత పెంచడానికి విధానపరంగా చాలా మార్పులు తీసుకొచ్చారు.
గత పదేళ్ల బడ్జెట్‌లలో ఆదాయ పన్ను పరంగా వచ్చిన మార్పులు:
2014-15 బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అత్యంత కీలకమైన మార్పులు ప్రకటించారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు, ప్రాథమిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని (basic income tax exemption limit) రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు ఈ సీలింగ్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలుగా మార్చారు. అదే బడ్జెట్‌లో, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పెట్టుబడి పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. గృహ రుణంపై వడ్డీ మినహాయింపు పరిమితిని కూడా రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలు చేశారు.
2015-16 బడ్జెట్
2015-16 బడ్జెట్ సెషన్‌లో, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 25,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతోపాటు, సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితిని రూ. 30 వేలుగా మార్చారు. అదే సంవత్సరంలో గోల్డ్ మానిటైజేషన్ పథకం ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద, ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందొచ్చు.
2016-17 బడ్జెట్
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో, ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బులో 40% మొత్తాన్ని పన్ను రహితం (Tax-free) చేశారు. గృహ రుణం కోసం, సెక్షన్ 24 కింద రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు ఇచ్చారు. ఈ ఏడాది వివాదాల పరిష్కార పథకాన్ని ప్రారంభించారు. తద్వారా, చిన్నపాటి పన్ను వివాదాలను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించారు.
2017-18 బడ్జెట్
ఈ సంవత్సరం, వివిధ పరోక్ష పన్నులను ఏకీకృతం చేసే GSTని (వస్తువులు & సేవల పన్ను) దేశంలో అమల్లోకి తీసుకొచ్చారు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయంపై పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇదే బడ్జెట్ సెషన్‌లో, రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయంపై 10% & రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయంపై 15% సర్‌ఛార్జ్ విధించారు.
2018-19 బడ్జెట్
ఈ ఆర్థిక ఏడాది కోసం ప్రకటించిన బడ్జెట్‌లో, 3% 'ఎడ్యుకేషన్ సెస్'ను 4% 'ఆరోగ్యం & విద్య సెస్'గా మార్చారు. అదే సమయంలో, రూ. 40,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రకటించారు. దీనివల్ల జీతం తీసుకునే పన్ను చెల్లింపుదార్లకు (salaried taxpayers) చాలా ఉపశమనం కలిగింది. అదే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయ మినహాయింపు పరిమితిని రూ. 10,000 నుంచి రూ. 50,000 కు పెంచారు.
2019-20 బడ్జెట్
ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించారు. అదే సమయంలో, స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలనూ ప్రకటించారు. ఫలితంగా, అంకుర సంస్థలకు మూడేళ్ల పాటు 100 శాతం పన్ను మినహాయింపు లభించింది. వార్షిక టర్నోవర్ రూ. 250 కోట్ల వరకు ఉన్న కంపెనీలకు కార్పొరేట్ టాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.
2020-21 బడ్జెట్
ఈ ఆర్థిక సంవత్సరం మరో కీలకమైన మార్పు వచ్చింది. పాత పన్ను విధానానికి (Old tax regime) ప్రత్యామ్నాయంగా కొత్త పన్ను విధానాన్ని (New tax regime) ప్రకటించారు. దీని కింద తక్కువ పన్ను రేట్లు ఉన్నాయి కానీ మినహాయింపులు (Exemptions) & తగ్గింపులు (Deductions) లేవు. రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై 0%, రూ. 2.5-5 లక్షలపై 5%, రూ. 5-7.5 లక్షలపై 10%, రూ. 7.5-10 లక్షలపై 15%, రూ. 10-12.5 లక్షలపై 20%, రూ. 25% 12.5-15 లక్షలు, రూ. 15 లక్షలు దాటిన ఆదాయంపై 30% పన్ను రేటు విధించారు.
2021-22 బడ్జెట్
ఈ బడ్జెట్‌లో, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లు, కేవలం పెన్షన్ & వడ్డీ ఆదాయాన్ని మాత్రమే పొందేవారికి ఆదాయ పన్ను రిటర్న్‌ల దాఖలు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇంతకుమించి ఆదాయ పన్నుకు సంబంధించిన ప్రకటనలేవీ లేవు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపశమనం కల్పించేందుకు కొన్ని ప్రకటనలు చేశారు.
2022-23 బడ్జెట్
వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం పన్ను (క్రిప్టోకరెన్సీ, ఇతర వర్చువల్ అసెట్స్) ప్రకటించారు. డిజిటల్ ఆస్తుల బదిలీపై 1% TDS తీసుకొచ్చారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్‌ఛార్జ్ రేటు 15%కు పరిమితం చేశారు.
2024 బడ్జెట్‌లో ఏం అంచనా వేస్తున్నారు?
ఈసారి బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు ప్రకటిస్తుందన్న ఆశలు పెరిగాయి. ఎందుకంటే, పన్నుల విషయంలో సాధారణ ప్రజలకు చాలాకాలంగా ఊరట లభించలేదు.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ 5 శాతం దాటిన ద్రవ్యోల్బణం - మీ EMI భారం ఇప్పట్లో తగ్గదు!