Layoffs: ట్రంపరితనం వల్ల ఈ కంపెనీల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయ్!, లిస్ట్‌లో ఫస్ట్ పేరు ఇదే
Layoffs in US Companies: 'ఎఫిషియన్సీ డ్రైవ్' ప్రభావంతో చాలా పెద్ద కంపెనీలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి, డజన్ల కొద్దీ కాంట్రాక్టులు రద్దవుతున్నాయి.

Layoffs in US Consulting Companies: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ చేతికి ప్రభుత్వ పగ్గాలు వచ్చిన వెంటనే, ప్రభుత్వ వ్యయ వైఖరి మారిపోయింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)' కమాండ్‌ను గ్లోబల్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. ఈ విభాగం మస్క్ చేతుల్లోకి రాగానే, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి & వ్యవస్థను సమర్థవంతంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ కారణంగా, వేలాది మంది ప్రభుత్వాధికారులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ వేడి ప్రైవేట్ రంగాన్ని కూడా తాకింది.
ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీలపై కమ్ముకుంటున్న సంక్షోభ మేఘాలు
మార్చిలో రిలీజ్ అయిన రిపోర్ట్స్ ప్రకారం, అన్ని అమెరికన్ ప్రభుత్వ సంస్థలు, తాము ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించాలని ఆదేశాలు అందుకున్నాయి. అంటే, ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీలతో ఒప్పందాలను కొనసాగించడం అవసరమా, కాదా అని ప్రభుత్వ సంస్థలు నిరూపించుకోవాలి. అన్ని ఏజెన్సీలు చేసుకున్న టాప్ 10 ఒప్పందాల గురించి నివేదించమని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (GSA) సూచించింది. అనవసరమైన వాటిని తొలగించడమే దీని ఉద్దేశ్యం.
డెలాయిట్, యాక్సెంచర్, ఐబీఎం వంటి చాలా కంపెనీలు లక్ష్యం
ఈ ఆదేశాలతో అమెరికాలోని ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీల్లో కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా, డెలాయిట్‌పై అతి పెద్ద ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. డెలాయిట్, తన ప్రభుత్వ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించిందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది. కొన్ని రంగాలలో వృద్ధి మందగిస్తోందని, ప్రభుత్వ క్లయింట్ల అవసరాలు మారుతున్నాయని, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసే వారి సంఖ్య కూడా తగ్గిందని డెలాయిట్ చెబుతోంది. ఈ కారణాల వల్ల సిబ్బందిని బలవంతంగా తగ్గించాల్సి వస్తుందోని వెల్లడించింది.
ప్రమాదంలో బిలియన్ డాలర్ల ఆదాయం
ఫార్చ్యూన్ రిపోర్ట్ ప్రకారం, DOGE ఆదేశానుసారం, డెలాయిట్‌తో చేసుకున్న 124కు పైగా ప్రభుత్వ ఒప్పందాలను కుదించారు లేదా మార్చారు. ఆ ఒప్పందాల మొత్తం విలువ 1.16 బిలియన్ డాలర్లు. అంటే రూ. 9,700 కోట్లకు పైమాటే. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ & హ్యూమన్ సర్వీసెస్ చేసుకున్న 51 మిలియన్ డాలర్ల విలువైన ఒక ఒప్పందం రద్దయింది.
ఈ ప్రభావం డెలాయిట్ మీద మాత్రమే కాదు, బూజ్ అలెన్ హామిల్టన్, యాక్సెంచర్ ఫెడరల్ సర్వీసెస్, IBM వంటి పెద్ద కంపెనీలపైనా పడింది. ఈ కంపెనీల్లో పదుల సంఖ్యలో ప్రభుత్వ ఒప్పందాలకు కత్తెర పడింది లేదా ఒప్పందాలు రద్దయ్యాయి. బూజ్ అలెన్ హామిల్టన్‌కు వచ్చిన 61 ప్రభుత్వ కాంట్రాక్టులు మొత్తం విలువ 207.1 మిలియన్ డాలర్లు అని, యాక్సెంచర్‌కు వచ్చిన 30 ప్రభుత్వ కాంట్రాక్టుల మొత్తం విలువ 240.2 మిలియన్ డాలర్లు అని ఫార్చ్యూన్ నివేదించింది. 34.3 మిలియన్ డాలర్ల విలువైన IBM 10 ఒప్పందాలు కూడా రద్దయ్యాయి.
Inc.com నివేదిక ప్రకారం, సమీక్షలో ఉన్న 10 ప్రధాన కన్సల్టింగ్ సంస్థల ఒప్పందాల మొత్తం విలువ 65 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు "ఖరీదైన లేదా పనికిరాని ఒప్పందాలను" ముగించే మూడ్‌లో ఉంది. ఈ విధానం వల్ల ప్రైవేట్ కన్సల్టింగ్ కంపెనీల బిలియన్ డాలర్ల ఆదాయం ప్రమాదంలో పడుతుంది & భారీ మొత్తంలో ఉద్యోగాలు పోతాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా హెచ్చరించింది.





















