IPhone Exports: భారత్, చైనా నుంచి అమెరికాకు ఐఫోన్‌ల పార్శిల్ - 3 రోజుల్లో 5 విమానాలు!
Indian IPhones Export to America: ట్రంప్ ప్రతీకార సంకాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆపిల్‌తో పాటు చాలా భారతీయ కంపెనీలు ఇటీవలి కాలంలో అమెరికాకు ఎగుమతులు పెంచాయి.

Apple Exports iPhones From India To US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌పై 26 శాతం ప్రతీకార సుంకం (Donald Trump's reciprocal tariff) విధించిన నేపథ్యంలో, ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను హడావిడిగా అమెరికా తరలించాయి. ఈ కంపెనీల లిస్ట్‌లో, ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ కూడా ఉంది. భారత్‌లోని మాన్యుఫాక్చరింగ్ ఫ్లాంట్‌లలో ఉత్పత్తి అయిన ఐఫోన్‌లు, ఇయర్ పాడ్‌లు సహా వివిధ రకాల ఉత్పత్తులను ఆపిల్ కంపెనీ చాలా వేగంగా USకు పార్శిల్ చేసింది. ప్రతీకార సుంకాల పెంపు ప్రకటనకు ముందే, తన గిడ్డంగుల్లోని నిల్వలను కేవలం మూడు రోజుల్లోనే అమెరికాకు చేరవేసింది. ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులతో నింపిన ఐదు రవాణా విమానాలను ఆపిల్ కంపెనీ అమెరికాకు పంపిందని సమాచారం.
వాస్తవానికి, ఇప్పుడు అమెరికాలో షాపింగ్ సీజన్ కాదు. అయినప్పటికీ, ఆపిల్ భారతదేశంతో పాటు చైనా నుంచి కూడా పెద్ద సంఖ్యలో షిప్‌మెంట్‌లను యూఎస్‌కు పంపింది. ఇతర కంపెనీల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విషయంలో కూడా ఇదే ధోరణి కనిపించిందని ఒక కస్టమ్స్ అధికారి తెలిపారు.
రత్నాలు & ఆభరణాలు, వస్త్రాల ఎగుమతులు
ట్రంప్ టారిఫ్‌ల ప్రకటనకు ముందు రత్నాలు & ఆభరణాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. వివిధ కంపెనీల హడావిడి ఎగుమతుల కారణంగా, ఏప్రిల్ 01 - 04 తేదీల మధ్య, ముంబైలోని కస్టమ్స్ కార్గో క్లియరెన్స్ సిస్టమ్ ద్వారా అమెరికాకు పంపిన రత్నాలు & ఆభరణాల ఎగుమతుల విలువ దాదాపు ఆరు రెట్లు పెరిగి 344 మిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ ఎక్స్‌పోర్ట్స్ విలువ 61 మిలియన్ డాలర్లు మాత్రమే. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన 10 శాతం బేస్‌లైన్ టారిఫ్‌ను నివారించడానికి బహుశా ఇలా చేసి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, టెక్స్‌టైల్స్ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
ఎగుమతులు $800 బిలియన్లు దాటవచ్చు
2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (FY25), భారతదేశం నుంచి వస్తువులు & సేవల ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా. 2023-24 (FY24)లో, భారతదేశం నుంచి వస్తువులు & సేవల ఎగుమతులు 3 శాతం తగ్గాయి, మొత్తం ఎగుమతుల విలువ 778 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
"ఈ ఏడాది మార్చి చివరి వారంలో (ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనకు ముందు) ఎగుమతుల్లో విపరీతమైన పెరుగుదల నమోదైందిది" - రత్నాలు & ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్ కిరీట్ భన్సాలీ
"విమానాల ద్వారా అమెరికాకు ఉత్పత్తులు రవాణా చేయడానికి అవకాశం ఉన్న అన్ని భారతీయ రంగాల నుంచి ఎగుమతులు పెరిగాయి. మార్చి 2025 నాటికి ఎగుమతులు 40 బిలియన్లకు మించుతాయని ఆశిస్తున్నా." - FIEO డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్
భారతదేశ ఎగుమతులు & దిగుమతుల విలువతో కూడిన వాణిజ్య సమాచారం ఏప్రిల్ 15న విడుదల అవుతుంది.





















